మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ మళ్లీ మీడియా ముందుకు వస్తున్నట్టు ప్రకటన చేయడంతో ప్రకాష్ రాజ్ ఆత్మ పేరుతో మరో అసోసియేషన్ ను మొదలుపెట్టబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తన ప్యానెల్ సభ్యులతో రాజీనామాలు చేయించి ఆత్మ లేదని, ప్రేతాత్మ లేదని వెల్లడించారు.
అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి మాత్రం కొత్త అసోసియేషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఈ దిశగా ఆలోచనలు చేశారని సమాచారం. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ పని చేస్తే విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావించి కొత్త అసోసియేషన్ విషయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వెనక్కు తగ్గారని తెలుస్తోంది.
ఆరు నెలల లోపు విష్ణు హామీలు నెరవేర్చకపోయినా, పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఆత్మ గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రకాష్ రాజ్ మద్దతుదారులు పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. మరోవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. పింఛన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.