ఒక సినిమా ఒకసారి వాయిదా పడటం అంటేనే పెద్ద విషయం.. రెండుసార్లు వాయిదా పడటం ఇంకా పెద్ద విషయం.. మూడుసార్లు, నాలుగుసార్లు.. ఇలా వాయిదాలు పడుతూ ఉంటే అది ఎంత పెద్ద విషయం అనేది చెప్పలేం. ఈ వాయిదాల ఫీలింగ్ గురించి తెలియాలి అంటే.. సితార నాగవంశీనే అడగాలి. ఆయన సినిమాలు ఎప్పుడూ చెప్పినట్లు విడుదల చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఆ స్టైల్‌లోనే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను వాయిదా వేస్తూనే ఉన్నారు. అయితే ఈ వాయిదాలకు ఆయనే కారణం అని చెప్పలేం.
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల నిరవధిక వాయిదా వేశారు. అంటే సినిమాను వాయిదా వేశారు కానీ.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చెప్పలేదు. అయితే అక్టోబరు 30న సినిమాను రిలీజ్ చేయొచ్చు అంటూ ఓ వార్త తెలుగు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమా ఆ డేట్‌కి కూడా వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు త్వరలో సినిమా టీమ్ నుండి అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది.
సినిమా పనుల్లో బ్యాలెన్స్ ఉన్నది బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే. కానీ నిజానికి కొన్ని పోర్షన్స్ షూటింగ్ కూడా చేయాల్సి ఉంది అని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ ఊటీలో ఉన్నారు. అప్పటికే ఓకే అయిపోయిన ‘జనవరి 12 విడుదల’ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఆ పనులు అయ్యాక హైదరాబాద్ వస్తే.. అప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌కి హాజరవుతారట. అప్పుడు కానీ ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత రాదు.
ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కథ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగవంశీ.. ‘జైలర్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారట. ఆ సినిమా కోసం భారీ మొత్తంలో డబ్బులు పెట్టేసిన నేపథ్యంలో.. మొత్తంగా ఆ సినిమా మీద దృష్టి పెట్టడానికి మిగిలిన పనులు పక్కన పెట్టేశారని.. అందుకే అక్టోబరు 30 అనుకున్నది కాస్తా నవంబరు 30 అవుతోంది అనే మాటలూ వినిపిస్తున్నాయి.