తెలుగు సినిమాలకు తమిళనాడులో సరైన ఆదరణ దక్కడం లేదు అంటూ తరచూ చదువుకుంటూ ఉంటాం. మన పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు తమిళనాట మన సినిమాకు సరైన థియేటర్లు దక్కడం లేదు అంటూ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కర్ణాటక గురించి ఇలాంటి విషయాలతోనే డిస్కషన్ నడుస్తోంది. కారణం ‘ఓజీ’ సినిమా. ఈ సినిమాకు శాండిల్‌వుడ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా విడుదల నేపథ్యంలో జరుగుతున్న పంచాయితీ అని మరికొందరు అంటున్నారు.
ఇప్పుడు, ‘కాంతార’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తూ జీవోను జారీ చేసింది. ఒక రోజు ముందు అంటే బుధవారం రాత్రి ప్రీమియర్ సహా అక్టోబరు 2 నుండి 11 వరకు టికెట్ల రేటు పెంపునకు కూడా ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.100 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రీమియర్లకు అదనపు టికెట్ ధర పెట్టలేదు. పైన చెప్పిన పెంపే వర్తిస్తుంది అని జీవోలో పేర్కొన్నారు.
డబ్బింగ్ సినిమాకు టికెట్ల రేట్లు పెంపు ఏంటి? ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాకు ఎలా ధరలు పెంచుతారు అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ చర్చ జరుగుతోంది. తెలుగు సినిమాను బతికించుకోవడానికి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాతలకు లాభం చేకూరేందుకు రేట్ల పెంపు అని తొలుత చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు కన్నడ డబ్బింగ్ సినిమాకు ఎలా పెంపు ఇస్తారు అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు హైక్ ఇచ్చింది. అదే సమయంలో కన్నడ నాట ‘ఓజీ’ సినిమా పడుతున్న ఇబ్బందుల గురించి కూడా స్పందించారు.
‘ఓజీ’ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగారని చిత్రబృందం పవన్ దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ‘ఓజీ’ సినిమాకు ఇబ్బంది రాకుండా ఉండటానికే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాకు పెంపు ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ సినిమా ధరల పెంపునకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.