‘వారణాసి’ సినిమా విడుదల విషయంలో ఇచ్చిన మాట మీద నిలబడతారో లేదో తెలియదు కానీ.. ఒకవేళ నిలబడితే ఆయన చాలా ధైర్యవంతులు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని ‘వారణాసి’ సినిమా ప్లాన్ చేస్తోంది. దీని కోసం లాంగ్ వీకెండ్ ఉన్న రోజును కూడా పట్టేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల చేస్తామని చెప్పింది. కానీ అక్కడికి రెండు వారాల ముందు ఓ పెద్ద సినిమా విడుదల కాబోతోంది.
మామూలుగా అయితే మహేష్ బాబు సినిమా అంటే దగ్గర్లో విడుదల చేయడానికి చాలామంది ఆలోచిస్తారు. పెద్ద హీరోలైతే రెండూ ఒకే టైమ్‌కి ఎందుకు అనుకుంటే.. చిన్న హీరోలు అయితే మనకెందుకు పోటీ అని కామ్‌గా ఉంటారు. కొంతమంది యంగ్ హీరోలు ఇలా పోటీకొచ్చి గెలిచారు అనుకోండి. ఆ విషయం వదిలేసి అసలు విషయానికొస్తే 2027 మార్చి ఆఖరులో ఓ పెద్ద సినిమా రెడీ అయింది. అదే ‘గాడ్జిల్లా – కాంగ్ సూపర్ నోవా’. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది.
దీంతో పాన్ వరల్డ్ రేంజి విడుదలను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రాజమౌళి – మహేష్‌బాబు ఇప్పుడు ఆ స్థాయి రిలీజ్ చేయగలరా అనేది ఓ డౌట్. అయితే రెండు సినిమాల మధ్య గ్యాప్ రెండు వారాలు ఉండటం కాస్త కలిసొచ్చే అంశం. ఎందుకంటే ‘వారణాసి’ సినిమాను భారతీయ భాషలతోపాటు కొన్ని విదేశీ భాషల్లోనూ ముఖ్యంగా ఇంగ్లిష్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది భారీ స్థాయిలో ఉండాలంటే ముందు, వెనుక పెద్ద సినిమాలు ఉండకూదు. కానీ ఇప్పుడు ‘గాడ్జిల్లా కాంగ్’ ఉంది.
అయితే, పైన చెప్పినట్లు రెండు వారాల గ్యాప్ చాలని రాజమౌళి అనుకొని ఉండాలి. లేదంటే తనకు అలవాటు అయినట్లు ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్ మారాలి. మరి వీటిలో ఏది జరుగుతుందో తెలియాలంటే ఇంకో 12 నెలలుగా ఆగాలి.