Mohan Babu: మాట్లాడతా అన్నారు… ఇప్పుడు మాట్లాడను అంటున్నారు

‘అన్నీ అక్టోబరు 10 తర్వాతే’…. టాలీవుడ్‌ కష్టాలు, నష్టాలపై మంచు కుటుంబాన్ని కదిపితే చెప్పిన మాట ఇదే. పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… మోహన్‌బాబు పేరును ప్రస్తావించారు. దీనిపై ఆ మధ్య మీడియా మోహన్‌బాబును, విష్ణును అడిగితే… పదో తేదీ తర్వాత దానిపై వివరంగా మాట్లాడతాం అన్నారు. దీంతో ఈ విషయంపై ఆ రోజు క్లారిటీ వస్తుందిలే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ‘తూచ్‌… నేను మాట్లాడను’ అంటున్నారు మోహన్‌బాబు. ఇంతకీ మాటలో మార్పు ఎందుకొచ్చింది.

మోహన్‌బాబు అంటే ఓ ఫైర్‌బ్రాండ్‌, మాట మీద నిలబడే వ్యక్తి. పరిశ్రమలో చాలా ఏళ్లుగా అందరూ ఇదే మాట చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ‘పరిశ్రమ కష్టాలు’లోకి మోహన్‌బాబును తెచ్చారు. ‘‘మోహన్‌బాబు గారూ.. ఒకసారి ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడి చిత్రపరిశ్రమను హింసించొద్దని చెప్పండి’’ అని పవన్‌ ఆ సభలో కోరారు. దాంతోపాటు ‘‘ చిత్రపరిశ్రమకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్లై చేసిన రూల్‌… మీ విద్యా సంస్థలకు అప్లై చేస్తే పరిస్థితి ఏంటో ఆలోచించండి’’ అని అన్నారు పవన్‌.

దీంతో పరిశ్రమ సమస్యలపై స్పందించాల్సిన ఆవశ్యకత మోహన్‌బాబు మీద పడింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఏమంటారు అనే ఉత్సుకత ప్రజల్లో ఏర్పడింది. పవన్‌ చెప్పినట్లు వైఎస్‌ జగన్‌ కుటుంబానికి మోహన్‌బాబు కుటుంబం చాలా దగ్గర. ఇది ఎవరూ కాదనలేని విషయం. ఇక రెండోది పవన్‌ ప్రశ్న. దీనిపై మోహన్‌బాబు సమాధానం చెబుతారేమో అని అనుకున్నారంతా. అయితే మోహన్‌బాబు స్పందించలేదు. వేదిక దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అని వదిలేశారు.

దానిని ఓ సూచన అనుకోవచ్చు, చురక అనుకోవచ్చు. ‘కొందరు నన్ను రెచ్చగొట్టాలని చూశారు. సింహం నాలుగు అడుగులు వెనక్కేసిందని తేలిగ్గా చూడొద్దు. వేదిక దొరికింది కదా అని ఇష్టారీతిగా మాట్లాడతారా? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. అయితే ఇది వేదిక కాదు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే వృథా. నటీనటులకు సాయం చేయాలని ఇద్దరు సీఎంలను కోరాలి. కేసీఆర్‌ను నటీనటులు ఎప్పుడైనా సన్మానించారా? జగన్‌ను ఎప్పుడైనా, ఏ వేడుకకైనా ఆహ్వానించారా?’ అని మోహన్‌ బాబు ప్రశ్నించారు. దీంతో విషయం పక్కకు వెళ్లిపోయింది.

అసలు ఈ విషయంలో మోహన్‌బాబు ఎందుకు మాట దాటేసినట్లు అనేది చూస్తే… ఆసక్తికర విషయాలు బయటికొస్తాయి. పవన్‌ వేసిన ప్రశ్న కానీ, ఆ తర్వాత చిరంజీవి అన్న మాటల్ని పట్టించుకుంటే… చిరు అన్నది తననే అని మోహన్‌బాబు ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇక పవన్‌ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే… ఏపీ సీఎంతో మాట్లాడాలి. ఒకవేళ మోహన్‌బాబు మాట్లాడి సమస్య పరిష్కారం కాకపోతే పరువు పోతుంది. మీ వల్ల కాలేదు అని తిరిగి మెగా కుటుంబం నుండి మాట వస్తుంది. రెండోది జగన్‌ దగ్గర ఈ సమస్య ప్రస్తావించినా… వెనక్కి తగ్గుతారని చెప్పలేం. ఈ నేపథ్యంలోనే మోహన్‌బాబు ఈ విషయంలో మౌనం దాల్చారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus