Konda Polam Review: కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

“ఉప్పెన” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా విడుదలవుతున్న చిత్రం “కొండ పొలం”. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన “కొండ పొలం” నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం లాక్ డౌన్ టైంలోనే పూర్తయ్యింది. నిజానికి ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఒటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే.. “ఉప్పెన” సక్సెస్ తర్వాత ప్లాన్ ఛేంజ్ చేసి థియేటర్లో విడుదల చేస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ & సాంగ్స్ ఆడియన్స్ ను ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: డిగ్రీ పాసై నాలుగేళ్లవుతున్నా ఉద్యోగం దొరక్క ఇబ్బందిపడుతుంటాడు రవి (వైష్ణవ్ తేజ్). ఇక ఉద్యోగం దొరకడం కష్టమని భావించి తండ్రితో కలిసి గొర్రెలు కాసుకోవడానికి ఊరికొచ్చేస్తాడు. గొర్రెలకు కావాల్సిన వనరులు ఊళ్ళో లేకపోవడంతో.. వేరే దారి లేక కొండ పొలం” చేయడానికి నల్లమల్ల అడవులకు వెళ్తారు. ఆ ప్రయాణం ఎలా సాగింది? వ్యక్తిగా రవికి ఈ కొండ పొలం ఎలా ఉపయోగపడింది? అనేది సినిమా కాన్సెప్ట్.

నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్ల కంటే ముందు మన కోటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకోవాలి. చాన్నాళ్ల తర్వాత ఆయన్ని వెండితెరపై చూడడం ఒక చక్కని అనుభూతినిస్తే.. తాతయ్య పాత్రలో ఆయన నటన, డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. వైష్ణవ్ తేజ్ నటుడిగా రవి పాత్రకు న్యాయం చేసాడు. అయితే.. సహజత్వం కాస్త కొరవడింది. కమర్షియల్ సినిమాల్లో పాత్రల్లో నటిస్తే సరిపోతుంది, అయితే.. ఈ తరహా సినిమాల్లో పాత్రలో జీవించాలి. రకుల్ లుక్స్ & పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

అయితే.. ఈ పాత్రకు తెలుగమ్మాయి అయితే ఇంకాస్త బాగుండేది. అంతమంది తెలుగు నటుల నడుమ రకుల్ మాత్రమే కనిపించడంతో సహజత్వం గాడి తప్పింది. సాయిచంద్ కు “సైరా” తర్వాత దొరికిన మంచి పాత్ర ఇది. ఆయన పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. రచ్చ రవి, మహేష్ విట్టా ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రెజెంట్ జనరేషన్ లో అసలు ఒక నవలను సినిమాగా తీయడం అనేదే పెద్ద సాహసం. ఆ సాహసానికి పూనుకున్నందుకు ముందుగా క్రిష్ అభినందనీయుడు. ఇది కమర్షియల్ సినిమా కాదు, ల్యాగ్ అనే పదానికి స్థానం లేని సినిమా ఇది. వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్ మీద తీసిన డాక్యుమెంటరీ లాంటి సినిమా ఇది. ప్రతి పాత్ర ఒక నీతి చెబుతుంది. ఒక దర్శకుడిగా క్రిష్ పంధా ఏమిటి అనేది తన మునుపటి చిత్రాలతోనే అందరికీ అవగతమైంది. ఇప్పుడు మరోమారు “కొండ పొలం”తో తన సత్తాను చాటుకున్నాడు క్రిష్.

ప్రకృతికి, వన్య ప్రాణులకు మనం ఇవ్వాల్సిన మర్యాద గురించి, మనిషి పోకడ గురించి చాలా చక్కగా వివరించాడు క్రిష్. ఒక దర్శకుడిగా క్రిష్ వందశాతం విజయం సాధించాడనే చెప్పాలి. కథకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు. అతడు ఎంచుకున్న కథ కూడా అలాంటిది అనుకోండి.

క్రిష్ తర్వాత కెమెరామెన్ జ్ఞానశేఖర్ ను మెచ్చుకోవాలి. ఆయన విజువల్స్ బాగున్నాయి. క్రిష్ రాసుకున్న కథను సినిమాగా ప్రెజంట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకం. దాన్ని ఆయన సమర్ధవంతంగా నిర్వర్తించారు. కీరవాణి నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. ఓబులమ్మ పాటలో సంగీతమే కాక సాహిత్యం కూడా శ్రావ్యంగా ఉండడం విశేషం. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. పులి గ్రాఫిక్స్ & ఫైట్ సీక్వెన్స్ బాగా తేలిపోయింది. ఇవి మినహాయిస్తే ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

విశ్లేషణ: “కొండ పొలం” రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. కానీ.. ప్రస్తుత తరానికి చాలా అవసరమైన సినిమా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రోజురోజుకీ తగ్గిపోతున్న జనరేషన్ మనది. ఈ సినిమా చూసి మనమేదో నేర్చేసుకోము, కానీ.. ఒక ఆలోచన వస్తుంది. కొన్ని విషయాలు తెలుస్తాయి. సో, తెలుగు ప్రేక్షకులు ఒకసారి చూడాల్సిన సినిమా, సాహిత్యాభిమానులు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus