కళ్యాణ్ రామ్ పదమూడేళ్లుగా సినీరంగంలో ఉన్నాడు. అయినా అతడు నటించిన సినిమాల సంఖ్య పదమూడు దాటలేదు. ఈ లెక్క మొన్నటికి మొన్న తెరమీదికొచ్చిన ‘ఇజం’ని కలుపుకునే. ఇన్నేళ్ల కెరీర్ లో అతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరిచిన దర్శకులు లేకపోవడం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కళ్యాణ్ రామ్ తనవద్దకు వచ్చిన కథలలో నచ్చినవాటిని చేస్తూ జయాపజయాలకు అతీతంగా తన కెరీర్ ని నడువుతూ వస్తున్నాడు. మధ్యలో హరేరామ్, యాక్షన్ 3డి వంటి ప్రయోగాలను చేశాడు. పటాస్ తర్వాత సినిమాలను ఇంకాస్త సీరియస్ గా తీసుకున్న ఈ నందమూరి హీరో వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడట. అందుకు తగ్గట్టే దర్శకులు కూడా ఇతగాడిపై దృష్టి సారిస్తున్నారు.
ఇటీవల ‘ఇజం’ కోసం తనను తాను మార్చుకోవడం సినిమా పట్ల కళ్యాణ్ రామ్ కి ఉన్న తపనను తెలియజేస్తుంది. ఫలితం మాట ఎలా ఉన్నా నటుడిగా కళ్యాణ్ రామ్ ఓ మెట్టు పైకెక్కాడు. దీంతో కళ్యాణ్ రామ్ కోసం దర్శకులు కథలు సిద్ధం చేయడం మొదలెట్టారు. తొలిసినిమా ఈ నందమూరి హీరోతో ‘పటాస్’ సినిమా చేసిన అనిల్ రావిపూడి వద్ద కళ్యాణ్ రామ్ కి సరిపడే ఓ మంచి కథ ఉందట. యువత, సోలో తాజాగా శ్రీరస్తు శుభమస్తు సినిమాల దర్శకుడు పరశురామ్ కూడా కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. పరశురామ్ పూరి శిష్యుడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వెన్నెల, ప్రస్థానం తదితర సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవా కట్టా కూడా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రీతిన టాలీవుడ్ దర్శకులు తమ హీరోల జాబితాలో కళ్యాణ్ రామ్ ని చేర్చుకుంటే అనతికాలంలోనే అతడు బిజీ అయిపోవడం పక్కా.