తమిళనాడు బోర్డర్ లో నివసించే ఇరులర్ వర్గానికి చెందిన మగవాళ్ళను తప్పుడు కేసుల నుంచి కాపాడడం కోసం అడ్వకేట్ చంద్రు పడిన శ్రమ ఆధారంగా తెరకెక్కిన సెమీ బయోపిక్ “జై భీమ్”. సూర్య టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి టి.జె.జ్ణానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య స్వయంగా నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 2) అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దళితులపై అగ్ర కులాలు మరియు ప్రభుత్వం ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: పొలంలో పడే ఎలకలు, వాటి కోసం వచ్చే పాములు పట్టుకుంటూ బ్రతికే ఓ సగటు దళిత కుటుంబం రాజన్న (కె.మణికందన్)-సినతల్లి (లిజోమోల్ జోస్). ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లో నగల చోరీ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తప్పు ఒప్పుకోమని ఎంత కొట్టినా.. చేయని తప్పును ఒప్పుకోను అని మొండికేస్తాడు రాజన్న. కట్ చేస్తే.. రాజన్న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడని చెబుతారు పోలీసులు.
తన భర్త ఎక్కడికి వెళ్లాడో దిక్కుతోచని పరిస్థితిలో అడ్వకేట్ చంద్రు (సూర్య)ను ఆశ్రయిస్తుంది సినతల్లి. రాజన్న కోసం చంద్రు దాఖలు చేసిన ఓ పిటిషన్ మొత్తం పోలీస్ వ్యవస్థనే కుదిపేస్తుంది. ఆ పిటిషన్ కారణంగా బయటకి వచ్చిన నిజాలేమిటి? అసలు రాజన్న విషయంలో ఏం జరిగింది? అనేది “జై భీమ్” కథాంశం.
నటీనటుల పనితీరు: అందరి కంటే ముందు సినతల్లిగా నటించిన మలయాళ నటి లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సినతల్లి పాత్రలో జీవించేసింది. భర్తను కోల్పోయి, చంకన ఒక బిడ్డ, కడుపున ఒక బిడ్డను మోస్తూ.. మొండి ధైర్యంతో ప్రభుత్వాన్ని, పోలీసులను, సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. సినిమాకి హీరో కథ అయితే.. సెకండ్ హీరో లిజోమోల్ జోస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అడ్వకేట్ చంద్రు పాత్రలో సూర్య కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. సాటి మనిషి పడే కష్టాన్ని తన కష్టంగా భావించే లాయర్ గా ఆయన హావభావాలు మనసుకి తాకుతాయి. “ఆకాశం నీ హద్దురా” లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ దొరకడం, ఆ పాత్రను అదే స్థాయిలో రంజింపజేయడం సూర్యకు మాత్రమే చెల్లింది. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రాజన్నగా కె.మణికందన్ సినిమాకి హైలైట్ గా నిలిచారు.
సాంకేతికవర్గం పనితీరు: ఎస్.ఆర్.కధిర్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమా జరుగుతున్నది 1995లో. అలాగని అనవసరమైన డీటెయిలింగ్ కు వెళ్లకుండా కేవలం లైటింగ్ తో ప్రేక్షకులను సినిమా మూడ్ లోకి తీసుకురావడం అనేది ప్రశంసనీయం. ఫ్రేమ్ వర్క్ కూడా బాగుంది. ఒక ఎమోషనల్ సినిమాకి కావాల్సిన విధంగా టింట్ ను మైంటైన్ చేశాడు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ తరహా సినిమాలకు ల్యాగ్ లేకుండా కట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 2.44 గంటల సినిమాలో కనీసం ఎండ్ క్రెడిట్స్ కూడా బోర్ కొట్టవు అంటే అందుకు కారణం ఫిలోమిన్ రాజ్ ప్రతిభ.
నిర్మాతలు సూర్య-జ్యోతిక సినిమాకి ఎంత అవసరమో అంత ఖర్చు చేశారు. ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఎక్కువ డీటెయిలింగ్ కు వెళ్లకుండా.. తక్కువ బడ్జెట్ లోనే అద్భుతమైన చిత్రాన్ని అందించారు. ఇక దర్శకుడు టి.జె.జ్ణానవేల్ విషయానికి వస్తే..రియల్ ఇన్సిడెంట్స్ ను సినిమాటిక్ గా కన్వర్ట్ చేయడంలో 100% శాతం సక్సెస్ అయ్యాడు. దళితుల వ్యధపై ఇప్పటివరకూ చాలా సినిమాలోచ్చాయి. అలాగే.. పోలీసుల అరాచకాల గురించి కూడా. అయితే.. ఈ రెండిటినీ కలిపి.. దొంగ కేసుల్లో దళితులను ఎలా ఇరికిస్తున్నారు? అనే అంశం మీద తీసిన “జై భీమ్”లో కథనం పరంగా మైంటైన్ చేసిన క్లారిటీకి జోహార్. పోలీస్ టార్చర్, అగ్ర కులాల బలుపు లాంటివి ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేశామ్.
అయితే.. ఈ చిత్రంలో ఓ సగటు మహిళ వేదన ప్రధానాంశంగా తీసుకొని దళితుల కష్టాలను తెరకెక్కించడం అనేది బాధ్యతతో కూడుకున్న పని. జ్ణానవేల్ బాధ్యత మాత్రమే కాదు.. అతడి మనోవేదన కూడా సినిమాలో కనిపిస్తుంది. సూర్య పాత్రలో సమాజం, ప్రభుత్వంపై కోసం కోపం ప్రస్పుటిస్తుంది, సినతల్లి పాత్రలో నిస్సహాయత్వం మనిషిగా మన ఉనికిని ప్రశ్నిస్తుంది. రాజన్న కీకలు సమాజంపై ఈసడింపులుగా ప్రజ్వలిస్తాయి. ఇలా ప్రతి పాత్రలో ఓ భావం, ఓ బాధ, ఓ బాధ్యత కనిపిస్తాయి. దర్శకుడుగా జ్ణానవేల్ ఈ చిత్రంతో విజయం కంటే మెండైన గౌరవాన్ని పొందాడు.
విశ్లేషణ: యావత్ భారతదేశానికి స్పూర్తి అయిన అంబేద్కర్ ను, ఆయన ఆలోచనలను తమిళ-మలయాళ దర్శకులు అర్ధం చేసుకున్నట్లుగా మన తెలుగు దర్శకులు ఎందుకు అర్ధం చేసుకోవడం లేదో అనే బాధ సినిమా ముగుస్తున్న తరుణంలో మెదడులో మెదులుతూ ఉంటుంది. పా.రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి దర్శకులు తెలుగులో ఎందుకు లేరు?. దళితులపై ఆకృత్యాలు కేవలం తమిళ సీమలో మాత్రమే జరుగుతున్నాయా?, లేదా ఆ తరహా సినిమాలు తీసే దమ్ము తెలుగు దర్శకులకు లేదా? తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరించరని భయమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు త్వరలో మన తెలుగు చిత్రసీమలో దొరుకుతాయని ఆశ సన్నగిల్లుతున్న తరుణంలో.. కనీసం డబ్బింగ్ రూపంలోనైనా ఈ తరహా సినిమాలను చూసే అదృష్టం కలిగింది అనే తృప్తితో ముందుకు సాగడం మినహా చేసేదేమీ లేదు.
తీసింది 1995 నేపధ్యంలో అయినా.. ఇప్పటికీ ఎన్నో వందల రాజన్నలు జైలు గోడల నడుమ నలిగిపోతున్నారు. ఎందరో సినతల్లులు జైలు గేట్ల బయట మగ్గిపోతున్నారు. ఈ తరహా సినిమాలు వచ్చినప్పుడు ఆదరించడం కూడా ఒక బాధ్యత. అప్పుడే మరిన్ని తెలియని, అణగదొక్కిన కథలు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా అనే మాధ్యమం ద్వారా ఈ తరహా కథలు వెలుగులోకి రావడం, చంద్రు వంటి ధైర్యవంతుల జీవితాల గురించి తెలుసుకోగలగడం ఒక అదృష్టం అని చెప్పొచ్చు. సో, డోన్ట్ మిస్ దిజ్ జెమ్ ఆఫ్ ఏ ఫిలిమ్!
రేటింగ్: 4/5