జక్కన్న

వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ సునీల్ ఎలా అయినా హిట్ కొట్టాలని చేసిన ప్రయత్నమే ‘జక్కన్న’. రక్ష వంటి హారర్ చిత్రాన్ని రూపొందించిన వంశీ కృష్ణ ఆకెళ్ళ పక్కా కమర్షియల్ సినిమా అయిన ‘జక్కన్న’ను తెరకెక్కించారు. మరి ఈ ‘జక్కన్న’ ఎంత మంది జీవితాలను చెక్కాడో.. తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

కథ : గణేష్(సునీల్) చిన్నప్పటినుండి తనకు పొరపాటున ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వారికి హెల్ప్ చేసేవరకు నిద్రపోయేవాడు కాదు. వారి జీవితలను సెటిల్ చేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకుంటుంటాడు. మరోవైపు వైజాగ్ ప్రాంతంలో డేగ అలియాస్ భవాని అనే వ్యక్తి రౌడీగా చెలామణి అవుతుండేవాడు. భైరాగి(కబీర్ సింగ్) అనే వ్యక్తి డేగా స్థానాన్ని సంపాదించడం కోసం అతన్ని చంపేస్తాడు. అప్పటినుండి వైజాగ్ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. భైరాగి ఎలా ఉంటాడనే విషయం ఎవరికీ తెలియదు. సైలెంట్ గా ఉంటూనే.. తన రౌడీయిజాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి భైరాగిని వెతుక్కుంటూ.. గణేష్ వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహస్ర(మన్నారా చోప్రా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతకీ గణేష్ కు భైరగితో ఉన్న సంబంధం ఏంటి..? అతన్ని వెంతుక్కుంటూ.. గణేష్ వైజాగ్ రావడానికి గల కారణాలేంటి..? సహస్ర ప్రేమను గణేష్ పొందగలిగాడా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్ : గణేష్ పాత్రలో సునీల్ ఎప్పటిలానే కనిపించాడు. పాత్రలో కొత్తదనం లేకపోవడం వలన సునీల్ నటన కొత్తగా ఏమి అనిపించదు. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. సునీల్ కామెడీ టైమింగ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. మన్నారాచోప్రా అందాల ప్రదర్శనకే పరిమితమయింది. డైలాగ్స్ చెప్పడంలో, హావభావాలు ప్రదర్శించడంలో అమ్మడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. కొంచెం బొద్దుగా కూడా కనిపిస్తుంది. విలన్ పాత్రలో కబీర్ సింగ్ తనదైన నటనను కనబరిచాడు. నిజానికి ఈ సినిమాలో కబీర్ కు పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. ఇక సప్తగిరి కామెడీ సినిమాలో హైలైట్ అయింది. అలానే కట్టప్పగా పోలీస్ పాత్రలో కనిపించిన పృధ్వీ కూడా చక్క్గగా నటించాడు. పోలీస్ డ్రెస్ లో బాలయ్య బాబుని ఇమిటేట్ చేస్తూ నటించాడు. సత్యరాజ్, రాజారవీంద్ర, చిత్రం శీను, నాగినీడు, ఆశిష్ విధ్యార్తి, రఘు కారుమంచి వారి పాత్రల పరిధుల్లో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : సంధర్భంలేని పాటలు ప్రేక్షకులకు బాగా విసుగు తెప్పిస్తాయి. వినడానికి, చూడడానికి కూడా అంత ఆసక్తిగా అనిపించవు. రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్ మాత్రం మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. ఫోటోగ్రఫి కూడా ఏవరేజ్ గా ఉంటుంది. వంశీ ఆకెళ్ళ అసలు ఎలాంటి కథను అనుకొని ఎలాంటి సినిమా తీశాడో ఆయనకే తెలియాలి. కథలో కానీ కథనంలో కానీ కాసింత కూడా కొత్తదనం కనిపించదు. పైగా ప్రాసల కోసం వాళ్ళు పడ్డ పాట్లు అంతా ఇంతా కాదు. కమర్షియల్ సినిమాలో పక్కాగా ప్రాసలు ఉండాలనే ఫీలింగ్ నుండి బయటకు వస్తే మంచిది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. ఇంకొన్ని సీన్లు ఎడిట్ చేస్తే బావుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ : ఇంకెంతకాలం ఇలాంటి రెగ్యులర్ ఫార్మాట్ కథలు నమ్ముకొని సినిమాలు చేస్తారో.. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి. అది మానేసి కామెడీను నమ్ముకొని రొమాంటిక్ సీన్స్, ఫైట్స్ తో సినిమా రన్ చేసేద్దాం అంటే ఎలా..? ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఆదరించడం మానేశారు. కథ ఉంటే చాలు కాస్టింగ్ గురించి కూడా ఆలోచించకుండా సినిమాలను హిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఫార్మాట్ సినిమాలు చాలా వచ్చి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో సునీల్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి!

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus