దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా ఈ బ్యూటీ విభిన్న కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. ఈమెని సౌత్ కి తీసుకురావాలని చాలా మంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కానీ జాన్వీ ఇప్పటివరకు సౌత్ సినిమా సైన్ చేయలేదు.
కానీ తన సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయంటే చాలు.. సౌత్ హీరోల గురించి తెగ మాట్లాడుతుంటుంది. ఇదివరకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పింది. అలానే ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టమని.. దక్షిణాది సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ ఇలా చాలా మందిని అభిమానిస్తానని చెప్పింది.
తాజాగా మరోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడింది. సౌత్ లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ఎన్టీఆర్ పేరు చెప్పింది. అతడు అద్భుతమైన నటుడని.. అతడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పింది. నిజానికి ‘లైగర్’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ కి పరిచయం కావాల్సింది కానీ ఆమె ఒప్పుకోలేదు. అంతకముందు ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం కూడా ఆమెని సంప్రదించారు.
రీసెంట్ గా మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. దానికి ఆమె నో చెప్పింది. ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో జాన్వీ.. ఎన్టీఆర్ పేరు చెప్పింది. కనీసం ఎన్టీఆర్30లోనైనా అమ్మడు హీరోయిన్ గా కనిపిస్తుందేమో చూడాలి!