తమిళనాడు సీఎం, ప్రముఖ కథానాయకుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాడు. అదే సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘సిగ్మా’. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఇంకో సినిమా కోసం ఆలోచించకపోతే ఆ సినిమా జులై 31న విడుదల కాబోతోంది. ప్రస్తుతం జేసన్ సంజయ్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రచారం కోసం వస్తే హీరోగా ఎంట్రీ ఎప్పుడు అని అడుగుదామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
సంజయ్ బయటకు రాకపోయినా.. ఈ విషయం బయటకు వచ్చేసింది. అవును, విజయ్ తనయుడిని హీరోను చేసేది ఎవరు అనేది చెప్పేశారు జీకేఎం తమిళ కుమరన్. ‘సిగ్మా’ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌లో హెడ్ ఆఫ్ ప్రొడక్షన్‌గా చేస్తున్న తమిళ కుమరన్ నిర్మాణంలోనే జేసన్ సంజయ్ తొలి సినిమా చేయబోతున్నారట. ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించిన తమిళ కుమరన్‌కు ఇది నాలుగో సినిమా అవుతుంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
ఓ ప్రముఖ దర్శకుడి ద్వారా జేసన్ సంజయ్ తొలి సినిమా (హీరోగా) వస్తుంది అని తమిళ కుమరన్ చెప్పారు. అయితే ఆయనెవరు అనేది చెప్పలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ అడిగితే.. లేదంటే విజయ్ కొడుకు కోసం ఆ సినిమా అని తెలిస్తే చాలా మంది దర్శకులు ముందుకొస్తారు. అయితే హీరో విజయ్ కొడుకు అరంగేట్రం అంటే కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని వచ్చి చేసే దర్శకుడు ఎవరు అనేది చూడాలి.
‘సిగ్మా’ విషయానికొస్తే.. ఈ సినిమాను జులై 31న రిలీజ్ చేస్తామని టీమ్ చెప్పింది. అయితే జులై 24న విజయ్ సినిమా ‘జన నాయగన్’ వస్తున్న నేపథ్యంలో ‘సిగ్మా’ తప్పుకుంటుంది అనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయంలోనూ క్లారిటీ రావాలి. ‘జన నాయగన్’ ట్రైలర్‌తో ఈ విషయం తేలిపోతుంది. అది ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ అవ్వొచ్చు..