జవాన్

హీరోగా హ్యాట్రిక్ హిట్స్ అందుకోగల సత్తా ఉండి కూడా “తిక్క, విన్నర్, నక్షత్రం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ చవిచూసిన కథానాయకుడు సాయిధరమ్ తేజ్ పక్కాగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో నటించిన చిత్రం “జవాన్”. రచయిత బి.వి.ఎస్.రవి దర్శకుడిగా తన రెండో ప్రయత్నంతోనైనా హిట్ అందుకోవాలన్న కసితో తెరకెక్కించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. హీరోతోపాటు దర్శకుడి కెరీర్ కు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు సంతుష్టులను చేసిందో చూద్దాం..!!

కథ : జై (సాయిధరమ్ తేజ్) దేశభక్తితోపాటు బాధ్యత మనసు నిండుగా కలిగిన యువకుడు. చిన్నప్పట్నుంచి దేశం మీద ప్రేమను నాన్న నూరిపోయగా, బాధ్యతను ఆర్.ఎస్.ఎస్ అలవాటు చేసింది. అటువంటి పర్ఫెక్ట్ ఇండియన్ సిటిజన్ అనుకోకుండా ఓ పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ను ఎదుర్కొని వాళ్ళు భారతదేశానికి చేయాలనుకొన్న నష్టాన్ని అడ్డుకొంటాడు. దాంతో ఆ టెర్రరిస్ట్ ఏజెన్సీ హెడ్ కేశవ్ (ప్రసన్న) జై మరియు అతడి కుటుంబంపై పగబడతాడు. “ఆక్టోపస్” అనే మిస్సైల్ సిస్టమ్ ను జై ద్వారా చేజిక్కించుకోవాలనుకొంటాడు. అయితే.. కుటుంబం కంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించి జై ద్వారా ఆ మిస్సైల్ సిస్టమ్ ను తెప్పించడం అంత ఈజీ కాదని గ్రహించి జై కుటుంబ సభ్యులను మధ్యలోకి లాగుతాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవడమే కాకుండా దేశ సంపదను కూడా కాపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక “జవాన్”లా మారిన జై ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ పై ఏ విధంగా విజయం సాధించగలిగాడు అనేది చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు : బాధ్యత గల యువకుడిగా సాయిధరమ్ తేజ్ ప్రశంసార్హమైన నటనతో అలరించాడు. ముఖ్యంగా దేశభక్తి గురించి, బాధ్యత గురించి వివరించే సన్నివేశాల్లో ఎమోషన్ ను అద్భుతంగా పండించాడు. అలాగే.. డ్యాన్స్, ఫైట్స్ విషయంలోనూ అలరించాడు. మెహరీన్ ఈ సినిమాలో మరీ బొద్దుగా, ఏదో మైదా పిండి ముద్దలా కనిపించింది. నటన పరంగా జస్ట్ ఒకే అనిపించుకొన్న మెహరీన్ అందాల ఆరబోతలో మాత్రం ఏమాత్రం మొహమాటం చూపలేదు. కాస్త ఫిట్ గా ఉండి ఉంటే ఆడియన్స్ ను ఆ అందాల ఆరబోతను ఎంజాయ్ చేసేవారేమో.

తమిళ నటుడు ప్రసన్న ఈ చిత్రంలో విలన్ గా నటించిన తీరు బాగున్నప్పటికీ.. అతడి క్యారెక్టరైజేషన్ “ధృవ” సినిమాలో అరవింద స్వామి క్యారెక్టరైజేషన్ ను పోలి ఉండడం, “ధృవ”లో అరవిందస్వామికి డబ్బింగ్ చెప్పిన సింగర్ హేమచంద్ర “జవాన్”లో ప్రసన్నకి కూడా చెప్పడం వల్ల ఆ ఫీల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే.. సత్యం రాజేష్ లాంటి మంచి పెర్ఫార్మర్ ను పెట్టుకొని కూడా అతడి చేత కామెడీ పండించకుండా ఏదో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వినియోగించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కాదు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ ఈ సినిమాకి అద్భుతమైన బాణీలు, అత్యద్భుతమైన నేపధ్య సంగీతం సమకూర్చి ఉండొచ్చు. కానీ.. నిన్న రాత్రి హైద్రాబాద్ లోని “శ్రీ రాములు” థియేటర్ లో సినిమా చూసినవారికి మాత్రం ఫస్టాఫ్ మొత్తంలో ఒక్క డైలాగ్ వినబడదు, ఇక పాటల్లో లిరిక్స్ అయితే ఏదో జాతర్లో ఫుల్ బేస్ పెట్టి వదిలేసిన పాటల్లో సగం అర్ధమై సగం వినబడక చిరాకు తెప్పిస్తుంది. అయితే.. నేను ఆల్రెడీ ఈ పాటల్ని “ఇయర్ ఫోన్స్” పెట్టుకొని విని ఉన్నాను కాబట్టి సంగీత దర్శకుడిగా తమన్ మంచి బాణీలు సమకూర్చాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో తెలియాలంటే నేను సినిమా ఇంకోసారి “శ్రీరాములు” థియేటర్ లో కాక ఏదైనా మంచి మల్టీప్లెక్స్ థియేటర్ లో చూడాలి.

కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. పాటల చిత్రీకరణ చూడ్డానికి ముచ్చటగా, ఎమోషనల్ సీక్వెన్స్ ల చిత్రీకరణ రోమాలు నిక్కబొడుచుకొనే స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే.. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే అవి సహజంగా ఉండేవి.

దర్శకుడు బి.వి.ఎస్.రవి రాసుకొన్న కథలో కొత్తదనం ఇసుమంతైనా లేదు. ఆల్రెడీ ఈ తరహా కథాంశాలతో ఇబ్బుడిముబ్బిడిగా సినిమాలోచ్చాయి. ఇక కథనం అయితే.. “ధృవ” చిత్రాన్ని చాలా ఎక్కువగా గుర్తు చేస్తుంది. అలాగే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇక హీరో-విలన్ మధ్య జరిగే అంతర్యుద్ధం ఎపిసోడ్ టెన్షన్ ను క్రియేట్ చేయలేకపోయింది. కానీ.. డైలాగ్ రైటర్ గా మాత్రం మచ్చ రవి అబ్బురపరిచాడనే చెప్పాలి. దేశభక్తి గురించి ప్రతి పౌరుడికి దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను మాటల్లో వివరించిన విధానం అభినందనీయం. ఎక్కువ పంచ్ డైలాగ్స్ లేకుండా చాలా వరకూ హీరో క్యారెక్టరైజేషన్ ను అతడి ఆలోచనా ధోరణి ద్వారా హైలైట్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్ గా రెండో ప్రయత్నంలోనూ దర్శకుడిగా బోటాబోటి మార్కులతో సరిపెట్టుకొన్నాడు బి.వి.ఎస్.రవి.

విశ్లేషణ : స్లో మోషన్ లో సాయిధరమ్ తేజ్ చేసే ఫైట్లు, ఎమోషన్ తో అతడు చెప్పే స్పూర్తిదాయకమైన మాటలు, మెహరీన్ బొద్దు అందాలు మెగా అభిమానులను అలరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. మంచి స్క్రీన్ ప్లే లేకపోవడం, కథలో కొత్తదనం లేకపోవడం వంటి కారణాల వల్ల రెగ్యులర్ మూవీ గోయర్స్ కి మాత్రం ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా మిగిలిపోతుంది. అయితే.. సాయిధరమ్ తేజ్ మాత్రం “హ్యాట్రిక్ ఫ్లాప్స్” నుంచి బయటపడి ఒక డీసెంట్ హిట్ అందుకొన్నట్లే.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus