Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కిరీటి రెడ్డి (Hero)
  • శ్రీలీల (Heroine)
  • జెనీలియా, వి రవిచంద్రన్, రావు రమేష్, వైవా హర్ష, అచ్యుత్, సత్య (Cast)
  • రాధా కృష్ణ రెడ్డి (Director)
  • రజినీ కొర్రపాటి, సాయి కొర్రపాటి (Producer)
  • దేవిశ్రీ ప్రసాద్ (Music)
  • కే కే సెంథిల్ (Cinematography)
  • నిరంజన్ దేవరమనే (Editor)
  • Release Date : జూలై 18, 2025
  • వారాహి చలనచిత్రం (Banner)

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తే బాగా వైరల్ అయ్యింది. అయితే.. కుటుంబ నేపథ్యానికి భిన్నంగా చాలా సౌమ్యుడిగా తనను తాను కిరీటిని ప్రొజెక్ట్ చేసుకున్న తీరు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, జెనీలియా రీఎంట్రీ ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. మరి సినిమాగా “జూనియర్” ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Junior Review in Telugu

కథ: అభినవ్ అలియాస్ అభి (కీరిటి రెడ్డి) తన తండ్రి అతిప్రేమకు దూరంగా, సరదాగా జీవితాన్ని గడిపేందుకు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుని బెంగుళూరులో ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు. హ్యాపీగా హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేసి ఉద్యోగం సంపాదించాలి అనుకుంటాడు.

అనుకోని విధంగా విజయ (జెనీలియా)తో ఈగో క్లాష్ కి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అభికి.

కట్ చేస్తే.. తన తండ్రి కోదండపాణి (రవిచంద్రన్) గురించి, తన బాస్ విజయ (జెనీలియా) గురించి ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది అభికి.

ఏమిటా నిజం? ఈ పరిస్థితిని అభి ఎలా ఎదుర్కొన్నాడు? ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడు? అనేది “జూనియర్” కథాంశం.

నటీనటుల పనితీరు: ఒక కమర్షియల్ యాక్టర్ కి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా కిరీటిలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే హీరోకి అవసరమైన అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో.. ఎక్కడా కిరీటికి ఇది మొదటి సినిమా అనిపించదు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్లు విషయంలో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు కిరీటి. ఓపెనింగ్ సీక్వెన్స్ లో వచ్చిన పార్కర్ ఫార్మాట్ ఫైట్ సీన్ లో మంచి ఎనర్జీ ఉంది. అలాగే.. డ్యాన్సుల్లో పునీత్ రాజ్ కుమార్ & జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. ముఖ్యంగా వైరల్ వయ్యారి పాటలో చాలా ఈజ్ తో కిరీటి చేసిన స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయం.

శ్రీలీల ఈ సినిమా ఫస్టాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది. సెకండాఫ్ లో మాయం అయిపోయింది. వైరల్ వయ్యారి తప్పితే ఆమె పాత్ర ఏమైపోయిందో కూడా అర్థం కాదు. కానీ ఉన్నంతలో గ్లామర్ యాడ్ చేసి.. వైరల్ వయ్యారి పాటలో డ్యాన్స్ తో అదరగొట్టింది.

జెనీలియా రీఎంట్రీ ప్రాజెక్ట్ అవ్వడంతో ఆమెను మళ్లీ చూసేందుకు జనం ఉవ్విళ్లురారు. అయితే.. ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.

కన్నడ నటుడు రవిచంద్రన్ తన సీనియారిటీతో పాత్ర బరువుతో సంబంధం లేకుండా మంచి నటనతో అలరించారు. రావు రమేష్, సత్య, వైవా హర్ష తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాలో విలన్ ఉన్నాడు కానీ.. ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ పాటలు డీసెంట్ గా ఉన్నాయి. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేపథ్య సంగీతం మాత్రం దేవి మునుపటి సినిమాలను గుర్తుచేస్తుంది. సెంథిల్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మంచి క్లాస్ వెల్యూ యాడ్ చేసింది. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనుకాడలేదు అని అర్ధమవుతుంది. మిగతా టెక్నికల్ అంశాలన్నీ బాగున్నాయి. ఒక మాస్ మసాలా సినిమాకి కావాల్సిన అంశాలను చక్కగా మేళవించారు.

దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఒక ప్రొపర్ కమర్షియల్ సినిమాగా “జూనియర్”ను ప్యాక్ చేశాడు. ఫైట్లు, డ్యాన్సులు, ఎమోషనల్ సీన్స్, ట్విస్టులు అన్నీ ఉన్నాయి. అయితే.. వాటి మేళవింపు మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. కిరీటిని మాస్ ఆడియన్స్ కు చేరువ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ.. సినిమాగా ఆకట్టుకునేలా చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఎందుకంటే.. ఈ తరహా కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ సినిమాలు ఒక 10-15 ఏళ్ల క్రితం బాగా ఆడేవి. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. రొటీన్ కమర్షియాలిటీ మరియు రెగ్యులర్ యాక్షన్ తోపాటు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అలరించే అంశాలు కూడా కోరుకుంటున్నారు. ఆ విషయంలో రాధాకృష్ణ ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: ఒక కొత్త హీరో లాంచ్ కి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం “జూనియర్”. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను అలరించే ఫైట్లు, డ్యాన్సులు, హీరోయిన్ గ్లామర్, కొద్దిపాటి కామెడీ అన్నీ ఉన్నాయి. కానీ.. ఆ అంశాలన్నిటినీ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఆస్వాదించే స్థాయిలో “జూనియర్” లేదు. అందువల్ల టైంపాస్ కోసం అయితే పర్వాలేదు కానీ.. లేదంటే మాత్రం కాస్తంత ఓపిక కావాలి.

ఫోకస్ పాయింట్: కిరీటి షో రీల్ ఈ జూనియర్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus