కబాలి

‘కబాలి’ గత కొన్ని రోజులుగా ఈ టైటిల్ మారుమ్రోగిపోతుంది. రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజిని అభిమానులే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం..!

కథ : మలేషియాలో ఓ కంపెనీలో పని చేసే కబాలి(రజినీకాంత్) అక్కడ తెలుగు వారి పరిస్థితి చూసి చలించిపోతాడు. కబాలీలో నాయకత్వ లక్షణాలు గుర్తించిన సీతారామరాజు(నాజర్) అనే సంఘసంస్కర్త కబాలిని తన టీమ్ లో ఒకడిగా చూస్తుంటాడు. టోనీ(విన్స్టన్ చావో) అనే గ్యాంగ్ స్టర్ భారతీయులైన చిన్న పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడేలా చేసి అక్రమ పనుల కోసం వారిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. టోనీ చేస్తోన్న పనులకు సీతారామారాజు అడ్డు పడుతుండడంతో తన అనుచరుడైన వీర శంకర్(కిషోర్)తో సీతారామరాజుని చంపిస్తాడు టోనీ. దీంతో కబాలి డాన్ గా మారిపోయి అక్రమ పనులన్నింటికీ కారణం టోనీనే అని తెలుసుకొని తనను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవల్లో గర్భిణిగా ఉన్న కబాలి భార్య కుందన వల్లి(రాధికా ఆప్టే)ని టోనీ మనుషులు షూట్ చేస్తారు. దీంతో కుందన వల్లిని షూట్ చేసిన వారందరిని కబాలి చంపేస్తాడు. దానికి కబళిని పాతికేళ్ళు జైలులో పెడతారు. జైలు నుండి తిరిగొచ్చిన కబాలి తన పగను తీర్చుకున్నాడా..? టోనీ అండ్ గ్యాంగ్ ను అంతం చేశాడా..? కబాలి భార్య నిజంగానే చనిపోయిందా..? అనే అంశాలతో సినిమా నడుస్తుటుంది.

నటీనటుల పనితీరు : కబాలి గా రజినీకాంత్ తన నటనతో ఇరగదీశాడనే చెప్పాలి. కానీ రజినిను ఇలాంటి పాత్రలో చాలా సార్లు చూసేసాం. అందుకే మనకు కొత్తదనం కనిపించదు కానీ తన స్లో వాక్, మ్యానరిజమ్స్ తో ఆకట్టుకుంటాడు. రాధికా ఆప్టే పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపించింది. ఇక రజినీకాంత్ కూతురిగా ధన్సిక అద్భుతమైన నటనను కనబరిచింది. లేడీ డాన్ గా కనిపించే తన కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ ఆకట్టుకుంటాయి. రజినీకాంత్ అనుచరుడిగా అట్టకత్తి దినేష్ కొంచెం అతి చేస్తాడు. తనను చంపే సీన్ లో మాత్రం అభినయంతో ఆకట్టుకున్నాడు. టోనీ పాత్రలో నటించిన చైనీయుడు విన్స్టన్ కూడా బానే నటించాడు. ఇక ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఇంతకుమించి ప్రధాన పాత్రలు కనిపించవు.

సాంకేతిక వర్గం పనితీరు : సినిమాకు మెయిన్ అసెట్ ఫొటోగ్రఫీ. అయితే కొన్ని ఫ్రేములు మాత్రం సో.. సో.. గా ఉంటాయి. ఈ సినిమాకు మరో అసెట్ నేపధ్య సంగీతం. కానీ రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి సారి అదే బ్యాక్ గ్రౌడ్ స్కోర్ రిపీట్ అవ్వడంతో కాస్త బోర్ కొట్టిస్తుంది. సన్నివేశాలు కూడా సినిమా నిడివిను పెంచాలి అన్నట్లుగా సాగదీశారు. రంజిత్ అనుకున్న కథను ఇంకా బాగా ప్రెజంట్ చేయొచ్చు. మలేషియాలో ఉండే తెలుగు వారి అవస్థ పట్ల ఇంకా మంచి కథనే సినిమాగా తీయొచ్చు. కథనంలో కూడా కొత్తదనం కనిపించదు. సినిమాను మాత్రం రిచ్ లొకేషన్స్ లో తీశారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ : ప్రజల కష్టాన్ని చూసి చలించిపోయి వారిలో నుండి నాయకుడిగా ఒకడు పుట్టడం. వారిని కష్టపెడుతున్న వారిని ఎదిరించడం ఇవ్వన్నీ పాత పుస్తకాలే. కాకపోతే ఈ సినిమాలో డాన్ కాస్త స్టయిలిష్ గా కనిపిస్తాడు అంతే తేడా.. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ క్యూరియాసిటీ కానీ కలగదు. సినిమాలో కామెడీ లేకపోయినా పర్లేదు కానీ కనీసం కథ, కథనంతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలి. అలా కాకుండా కేవలం రజినీకాంత్ లుక్స్ మీదే ఫోకస్ చేస్తే ఎలా.. కథతో ప్రేక్షకులకు సంబంధం ఉండదా..? రజినీకాంత్ అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోవచ్చు కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం పరీక్షే.. ఈ సినిమా కోసమా.. ఇంత కష్టపడి టికెట్స్ కొనుకున్నామని ఫీల్ అయ్యేవారు చాలా మందే ఉన్నారు. రజినీకాంత్ గత చిత్రాలతో పోలిస్తే మాత్రం కమర్సియల్ గా ఈ సినిమా వర్కవుట్ అవుతుందనే చెప్పాలి.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus