‘ఎన్టీఆర్ బయోపిక్’ లో మొదటి పార్ట్ అయిన ‘ఎన్టీఆర్- కధానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులతో పాటు… యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ‘ఎన్.బి.కే ఫిలిమ్స్’, ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ల పై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ పాత్రను పోషించాడు నందమూరి కళ్యాణ్ రామ్.
ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా కళ్యాణ్ రామ్ కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ ఎందుకు నటించలేదు అనే దానికి చాలా వార్తలు వచ్చాయి. బాలకృష్ణకు, జూ.ఎన్టీఆర్ కు మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడం వలెనే.. బాలయ్య, తారక్ ను పక్కన పెట్టారని.. చాలా వార్తలు వచ్చాయి. ఈ విషయం పై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. ”బాబాయ్. తారక్ ల మధ్య రిలేషన్ సరిగ్గా లేదనే వార్తలు నా వరకు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో నాకు అర్ధం కావడం లేదు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో లాంచ్ తారక్ చేతుల మీదుగా జరిగింది. తారక్ ఇప్పుడొక సూపర్ స్టార్.. తనను తీసుకొచ్చి ఏదొక పాత్రలో పెట్టేసి తన స్టార్ డమ్ కి న్యాయం చేయగలమని మేము అనుకోలేదు. బాబాయ్ కూడా తారక్ ని గౌరవించాలని ఆడియో రిలీజ్ ఫంక్షన్ తన చేతుల మీదుగా జరిపించారు. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదు. తారక్ కి ఈ సినిమాలో చిన్న పాత్ర ఇస్తే అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఆ ప్రయత్నం చేయాలనుకోలేదు” అంటూ వివరణ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.