నందమూరి కళ్యాణ్(Kalyana Chakravarthi) చక్రవర్తి చాలా మందికి ఇతను తెలిసుండకపోవచ్చు. కానీ ఇతను కూడా గతంలో హీరోగా సినిమాలు చేసి.. శోభన్ బాబు తరహా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగాడు. కళ్యాణ్ చక్రవర్తి విషయానికి వస్తే.. ఇతను స్వర్గీయ నందమూరి తారకరామారావు.. అదే మన సీనియర్ ఎన్టీఆర్ కు స్వయానా తమ్ముడు కొడుకు.
ఎన్టీఆర్ సోదరుడు అయినటువంటి త్రివిక్రమరావు పెద్ద కొడుకే ఈ కళ్యాణ్ చక్రవర్తి.ఎన్టీఆర్ రిఫరెన్స్ తోనే కళ్యాణ్ చక్రవర్తి సినిమాల్లోకి అడుగుపెట్టారు.దాసరి నారాయణ రావు వంటి దర్శకుల ప్రోత్సాహం కూడా ఇతనికి దక్కింది. అందుకే ‘అత్తగారు స్వాగతం’, ‘అక్షింతలు’, ‘అత్తగారు జిందాబాద్’, ‘ఇంటి దొంగ’, ‘మామ కోడళ్ల సవాల్’, ‘కృష్ణ లీల’, ‘రౌడీ బాబాయ్’ ,’దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు.
‘లంకేశ్వరుడు’ సినిమాలో చిరంజీవికి బావమరిది చేసిన పాత్ర ఇతనికి మరింత ప్లస్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా ప్లాప్ అవడంతో ఇతనికి కలిసి రాలేదు. తర్వాత ఎక్కువ కాలం నటుడిగా కొనసాగలేకపోయారు. 2003లో వచ్చిన కబీర్ దాస్ సినిమా తర్వాత కళ్యాణ్ చక్రవర్తి.. మరో సినిమాలో నటించలేదు.20 ఏళ్ళ తర్వాత అంటే 2023 లో నందమూరి తారకరత్న అంత్యక్రియల్లో ఇతను మెరిశాడు.
ఆ టైంలో ఇతని లుక్ చూసి అంతా షాక్ అయ్యారు.ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా తెరకెక్కుతున్న ‘ఛాంపియన్’ సినిమాతో కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన లుక్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.