తెలుగులో మన స్టార్ హీరోలతో సమానంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న సూర్య (Suriya) హీరోగా శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కంగువ” (Kanguva ). దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య ద్విపాత్రాభినయం, దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!
కథ: 2024 సంవత్సరంలో గోవాలో బౌంటీ హంటర్ ఫ్రాన్సిస్ (సూర్య). ఒక కేస్ డీల్ చేస్తున్న తరుణంలో జెటా (నందన్) అనే కుర్రాడు సాక్ష్యంగా మారతాడు. ఆ కుర్రాడ్ని చూసినప్పుడల్లా ఫ్రాన్సిస్ కు ఏదో తెలియని భావం కలుగుతుంటుంది. ఆ కుర్రాడ్ని రష్యన్ సైనికులు రంగంలోకి దిగేసరికి అవాక్కవుతారు ఫ్రాన్సిస్ టీమ్. కట్ చేస్తే.. 1070వ సంవత్సరంలో రోమన్ సైన్యం ప్రణవాదిని దక్కించుకోవడం కోసం పన్నిన పన్నాగాన్ని ఛేదిస్తాడు కంగువ (సూర్య). అయితే.. కపాల వర్గాన్ని (బాబీ డియోల్ & కో) ( Bobby Deol) ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో జెటా పాత్ర ఏమిటి? కంగువ/ఫ్రాన్సిస్ తో ఆ కుర్రాడికి ఉన్న అనుబంధం ఏమిటి? అసలు రష్యన్ గ్యాంగ్ జెటా కోసం ఎందుకు వస్తుంది? ఈ సైన్యాన్ని నడిపిస్తుంది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “కంగువ” చిత్రం.
నటీనటుల పనితీరు: సూర్య నిజంగానే ప్రాణం పెట్టేశాడు. ఫ్రాన్సిస్ గా అతడి క్యారెక్టరైజేషన్ లో పట్టు లోపించింది కానీ.. కంగువగా మాత్రం వీర విహారం చేశాడు. ఆటవిక పోరాట యోధుడిగా కనిపించడం కోసం శారీరికంగా అతడు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అలాగే.. ఎమోషనల్ సీన్స్ లో తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు. 1070వ సంవత్సరంలో సూర్య కనిపించే ప్రతి సన్నివేశంలో అతడి నటన ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుంది.
బాబీ డియోల్ ను సినిమాలో వేస్ట్ చేశారనే చెప్పాలి. క్యారెక్టరైజేషన్ లేకుండా కేవలం లుక్స్ తో విలనిజం పండించాలనుకోవడమే పెద్ద మైనస్. ఇక యోగిబాబు (Yogi Babu), రెడిన్ కింగ్స్లే (Redin Kingsley) కామెడీ సీన్లు తమిళ ఆడియన్స్ ను ఏమేరకు అలరిస్తాయో తెలియదు కానీ.. తెలుగులో మాత్రం ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. అదే విధంగా దిశా పటాని కూడా ఒక పాటలో బికినీతో ఆకట్టుకుంది కానీ.. నటిగా ఆమె అతి భరించలేం.
సూర్య తర్వాత నటుడిగా ఆకట్టుకున్నది బాలనటుడు నందన్ మాత్రమే. చాలా బరువైన పాత్రలో కనిపించాడు. కొన్ని చోట్ల భారీ ఎమోషన్స్ ను మోయలేకపోయాడు కానీ.. ఓవరాల్ గా ఆకట్టుకున్నాడు. కార్తీ చిన్న అతిథి పాత్రలోనూ అద్భుతంగా అలరించాడు. ముఖ్యంగా 1070 నాటి సీక్వెన్స్ లో అతడి నటన ఎండింగ్ లో మంచి హై ఇచ్చింది.
సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. పాటలు చక్కగా ఆకట్టుకోగా.. నేపథ్య సంగీతంతో మాత్రం మోత మోగించాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలకు దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇది సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. వెట్రి పళనిస్వామి (Vetri Palanisamy) సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మరో ఎస్సెట్ అని చెప్పాలి. గ్రాఫిక్స్ వల్ల కొన్ని యాక్షన్ బ్లాక్స్ సరిగా ఎలివేట్ అవ్వలేదు కానీ, మంచు కొండల్లో ఫైట్ సీక్వెన్స్ ను క్యాప్చూర్ చేసిన విధానం మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
సినిమా ఎడిటర్ ను మెచ్చుకోవాలి. సినిమా విడుదలకు ముందు ప్రాణం విడిచిన నిషద్ యూసఫ్ పనితనం సినిమాను సింప్లిఫై చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ లో పాస్ట్ & ప్రెజెంట్ ను కనెక్ట్ చేస్తూ బ్లెండ్ చేసిన సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమాకు ఆ సీక్వెన్స్ టెక్నికల్ గా హైలైట్ అని చెప్పాలి. రకరకాల తెగల మధ్య వైవిధ్యం చూపడం కోసం ప్రొడక్షన్ & కాస్ట్యూమ్స్ టీమ్ పడిన కష్టాన్ని గుర్తించాలి. ఇక నిర్మాతలు గ్రాఫిక్స్ తప్ప ఎక్కడా రాజీపడలేదు.
ఇక దర్శకుడు శివ “కంగువ” సినిమా మూలకథను “ది లాస్ట్ విచ్ హంటర్” నుంచి స్ఫూర్తి పొందినట్లుగా అనిపిస్తుంది. అయితే.. సూర్యను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో మాత్రం విజయం సాధించాడు. అలాగే.. 1070 నాటి ఎపిసోడ్స్ ను మాస్ ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్న తీరు కూడా బాగుంది. అయితే.. 2024 సంవత్సరం ఎపిసోడ్స్ మాత్రం కనీస స్థాయిలో కూడా లేవు. ముఖ్యంగా సూర్య-దిశ పటాని కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వలేదు. వాళ్ల కాంబినేషన్ సీన్స్ కూడా వెగటుగా ఉన్నాయి.
అయితే.. ఈ రెండు టైమ్ లైన్స్ ను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ను ఇంకాస్త నీట్ గా రాసుకుని ఉంటే సినిమా ఇంకాస్త నీట్ గా వర్కవుట్ అయ్యేది. అలాగే.. సూర్య-నందన్ కాంబినేషన్ సీన్స్ ఇంకాస్త చక్కగా వర్కవుట్ చేయొచ్చు, వారి మధ్య ఎమోషన్ సరిగా ఎలివేట్ అవ్వలేదు. సినిమాకి కీలకమైన వారి మధ్య బాండింగ్ ను ఇంకా చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆడియన్స్ ఇంకో రేంజ్ లో సినిమాకి కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఓవరాల్ గా.. శివ దర్శకుడిగా పర్వాలేదనిపించుకోగా, కథకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
విశ్లేషణ: రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ ను బ్లెండ్ చేస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయకుండా సినిమాను ఎలా నడిపించాలి అనేందుకు రీసెంట్ గా వచ్చిన విజయ్ సేతుపతి “మహారాజా” బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక క్రైమ్ డ్రామానే అంత అద్భుతంగా తీసినప్పుడు.. “కంగువ” లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ఇంకెంత బాగా తీయాలి చెప్పండి. అయితే.. “కంగువ” కంటెంట్ ఆడియన్స్ ను ఆ ప్రపంచంలో కూర్చోబెట్టడంలో విఫలమైంది.
ఎమోషన్స్ సరిగా వర్కవుట్ అవ్వలేదు. అలాగే, గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉండడంతో ఎలివేట్ అవ్వాల్సిన ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్స్ కనెక్ట్ అవ్వలేదు. సూర్య నట ప్రతిభ, నిషద్ ఎడిటింగ్, వెట్రి సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం మాత్రం “కంగువ”ను ఒకసారి థియేటర్లలో చూడదగ్గ చిత్రంగా నిలిపాయి.
ఫోకస్ పాయింట్: కథలో దమ్ముంది కంగా.. కథనంలోనే వెలితి నిండింది!
రేటింగ్: 2.5/5