మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ‘కన్నప్ప’ (Kannappa) మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగానే కాకుండా కథకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ట్రోలింగ్ తో మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రయాణం… ఇప్పుడు మెల్లగా పాజిటివ్ టర్న్ తీసుకుంది. గ్లింప్స్ పై కొంత ట్రోలింగ్ జరిగింది. దీంతో మంచు విష్ణు అండ్ టీం.. ఈ సినిమాలోని స్టార్స్ ని రంగంలోకి దింపారు.
అంటే… ఈ సినిమాలో నటించిన స్టార్స్ ఫుటేజీని బయటకు తీశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘రుద్ర’ అనే అతి ముఖ్య పాత్ర పోషించిన ప్రభాస్ (Prabhas) రోల్ కి సంబంధించిన విజువల్స్ ను టీజర్లో గట్టిగా వాడారు. అది సినిమా హైప్ కి పనికొచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అందరి స్టార్స్ అందరి పాత్రలకి ఒక క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్ (Mohanlal), ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar) పోషించిన పాత్రలు వివరిస్తూ కట్ చేసిన ట్రైలర్ కట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
దీంతో ట్రేడ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గత 2,3 నెలలుగా సరైన సినిమా లేదు. ముఖ్యంగా మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రప్పించే సినిమా రాలేదు. పైగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా వాయిదా పడింది. ‘కుబేర’ (Kuberaa) వస్తున్నా.. అది అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా కాదు. అందుకే ‘కన్నప్ప’ (Kannappa) కి కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఈ సినిమాకి గ్రాండ్ రిలీజ్ దక్కుతుంది. తెలుగులో కంటే హిందీలో ఇంకా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
‘కన్నప్ప’ (Kannappa) కి రూ.150 కోట్లు బడ్జెట్ అయ్యింది.చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఓటీటీ బిజినెస్ కి కూడా మంచు విష్ణు అంగీకరించలేదు. కచ్చితంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని, రిలీజ్ తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో మంచి ఆఫర్లు వస్తాయని.. మంచు విష్ణు (Manchu Vishnu) భావిస్తున్నట్టు టాక్. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియదు.. కానీ ప్రస్తుతానికైతే ‘కన్నప్ప’ (Kannappa) పై పాజిటివిటీ రెట్టింపు అయ్యింది.