సినిమాల్లో పని చేస్తున్న చాలామందికి ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అది ఏమంత రుచిగా ఉండదు. యాక్షన్.. కట్ చెప్పడానికి ముందు వాళ్ల జీవితంలో చూడని కష్టం ఉండదు అంటుంటారు. ఈ పరిస్థితి అందరికీ ఉంటుంది అని చెప్పలేం కానీ.. చాలామందికి ఉంటుంది అని చెప్పొచ్చు. ‘కాంతార’ రీసెంట్‌గా పాన్ ఇండియా నటుడు, దర్శకుడు అయిపోయిన రిషబ్ శెట్టి వెనుక కూడా ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. సినిమాలో సగటు మనిషి పడే కష్టాలన్నీ ఆయన పడ్డారు. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోకముందు చాలా వేషాలేశారట. అయితే అవి సినిమాల కోసం కాదు.. అప్పుల నుండి తప్పించుకోవడానికి.
సినిమాల మీద ఆసక్తి ఉన్నా.. బతుకు బండి లాగడానికి రిషబ్ శెట్టి సినిమాల్లోకి వచ్చేముందు ఓ వాటర్ సప్లై కంపెనీలో పనిచేసేవారట. అప్పుడు రోజుకు రూ.50 సంపాదించేవారట. అలా ఓసారి సినిమా వాళ్లతో పరిచయం ఏర్పడి.. ‘సైనైడ్’ అనే సినిమాలో సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అప్పుడు రోజుకు రూ.యాభై ఇచ్చేవారట. అయితే ఆ స్పాట్‌కు వెళ్లడానికే రూ. వంద ఖర్చయ్యేదట. కానీ సినిమాల మీద ఆసక్తితో ఎడిటర్, లైట్ బాయ్, టచప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పని నేను చేసి చాలా వివరాలు తెలుసుకున్నారట రిషబ్.
ఆ తర్వాత రవి శ్రీవత్స సినిమా ‘గండ హెండతి’ యూనిట్‌లో క్లాప్ బాయ్‌గా చేరారట. ఓ రోజు కెమెరామెన్ సూచనతో ఓచోట నిలబడితే.. ఇక్కడెవరు నిల్చోమన్నారు నిన్ను అంటూ.. డైరక్టర్ కోప్పబడ్డారట. దీంతో ఇక సినిమాలొద్దు అనుకుని వెళ్లిపోయారట. ఆ సినిమాకు సంవత్సరం పని చేస్తే రూ.1500 ఇచ్చారట. అయితే అప్పటికే చేస్తున్న మినరల్ వాటర్ వ్యాపారాన్ని మానేసి ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నారట రిషబ్. అప్పటిదాకా సంపాదించిన డబ్బు, కొంత అప్పు చేసి తీసుకున్న డబ్బుతో 2009లో హోటల్ వ్యాపారం పెట్టారు రిషబ్.
అయితే ఆ వ్యాపారంలో మొత్తంగా రూ. 25 లక్షలు నష్టపోయారట. ఆ వ్యాపారం కోం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చిందట. అలా 2012 వరకూ అప్పులు కడుతూనే ఉన్నారట. దీంతో మళ్లీ సినిమాల వైపు వెళ్లాలి అనుకున్నారట. ఈ క్రమంలో వేషాల కోసం గాంధీనగర్‌లో తిరిగారట. అలా చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలొచ్చాయట. ఆ సమయంలో అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగేవారట రిషబ్.