గత 3 నెలల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు చాలా మంది మరణించారు. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతలు… లేదంటే నటీనటుల కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. గత నెలలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించారు. ఆ చేదు వార్త ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. ఆ షాక్ నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు.
అలాగే పక్క భాషల సినీ పరిశ్రమలో కూడా వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా… తాజాగా మలయాళంలో సినీ పరిశ్రమలో కూడా విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే… ప్రముఖ నటుడు కార్యవట్టం శశికుమార్ కన్నుమూశారు.పలు సినిమాల్లో లేదా టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన శశికుమార్ సోమవారం నాడు తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన సోమవారం నాడు మరణించాడని తెలియడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అల్లుకున్నాయి. 1989లో విడుదలైన ‘క్రైమ్ బ్రాంచ్’ చిత్రంతో ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కె ఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మలయాళ సినీ పరిశ్రమ ఓ మంచి నటుడిని, మంచి వ్యక్తిని కోల్పోయిందని నటి సీమా జి నాయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇంకా చాలా మంది నటీనటులు సాంకేతిక నిపుణులు శశికుమార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.