హీరోలు, హీరోయిన్లు.. బయటకు వస్తే కెమెరాలు క్లిక్ మనిపించి.. వాటిని వైరల్ చేయడంలో బిజీగా ఉంటారు ముంబయి మీడియా. చాలా వరకు అక్కడ నటుల ఔటింగ్, జిమ్ సెంటర్, ఎయిర్ పోర్టు లాబీ ఫొటోలే కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి మన దగ్గర చాలా తక్కువ. ఈ క్రమంలో నటుల పిల్లల ఫొటోలు క్లిక్ చేయడానికి కూడా ఫొటోగ్రాఫర్‌లు రెడీగా ఉంటారు. అందుకే ఈ మధ్య సినిమా జనాలు ఎక్కుగా ‘నో ఫొటోస్’ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ మేరకు రిక్వెస్ట్‌లు కూడా చేస్తున్నారు.
అలా ఇప్పుడు ప్రముఖ కథానాయిక కియారా అడ్వాణీ, ప్రముఖ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్ర దంపతులు కూడా మీడియాను రిక్వెస్ట్ చేశారు. కియారా ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప విషయంలోనే కియారా దంపతులు మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఫొటోలు తీయొద్దు అంటూ ఓ స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మా హృదయం ఉప్పొంగిపోతోంది. తల్లిదండ్రులుగా మేం మా మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని మేం పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నాం. అందుకే గోప్యతను పాటించాలనుకుంటున్నాం. అందుకే మా పాప ఫొటోలు ఎక్కడా షేర్ చేయడం లేదు. మీరు కూడా మా పాపను ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. మీ అందరి సపోర్ట్‌కు ధన్యవాదాలు అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు కియారా, సిద్ధార్థ్.
పైన చెప్పినట్లు సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో ‘నో ఫొటోస్’ పాలసీని కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ, దీపిక పడుకొణె – రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ – రణ్‌బీర్ కపూర్, రామ్‌చరణ్ – ఉపాసన.. ఇలా చాలామంది తమ పిల్లలను ఫొటోలు తీయొద్దని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. గతంలో ఆలియా భట్ ఈ విషయంలో ఓసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.