ప్రస్తుత రాజకీయ ప్రముఖులు, లీడర్లలో సమాజంలో మాత్రమే కాక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అందరితో మమేకమైపోతున్న ఏకైక నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు. రాజకీయాల్లో మాత్రమే కాదు చిత్రపరిశ్రమలోనూ ఆయనకు మంచి స్నేహితులున్నారు. రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకులు కేటీఆర్ కు మంచి స్నేహితులు. అందుకే “ధృవ” ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు కేటీయార్, అలాగే ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “భరత్ అనే నేను” స్పెషల్ షో ద్వారా వీక్షించిన కేటీయార్ సినిమా తనకు విపరీతంగా నచ్చేయడంతో.. సినిమా చూసిన అనంతరం సినిమా ప్రమోషన్ కోసం ఒక స్పెషల్ టాక్ షోలో పాల్గొని మహేష్ బాబు, కొరటాల శివలతో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మహేష్ బాబు మాట్లాడుతూ కేటీయార్ ను ఉద్దేశించి “సార్” అని సంభోధించగా.. దానికి సమాధానంగా కేటీయార్ “కావాలంటే రామ్ అని పిలువు కానీ సార్ అనకు, ఏదో నీకంటే పెద్దవాడిలా కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది” అంటూ కేటీయార్ చమత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “భరత్ అనే నేను” తరహాలో రాజకీయాల్లో ఎందుకని నియంత్రత లేదు, అలాగే.. రాజకీయాల్లోకి యువత రావాల్సిన మరియు యువతకు రాజకీయాలంటే ఆసక్తి చూపాల్సిన అవసరం ఎందుకుంది అనే విషయాలపై చిన్న టాక్ షో నిర్వహించారు. త్వరలోనే అన్నీ చానల్స్ లో ప్రసారం కానుంది.