మహనీయుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిన చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. బసవతారకం మరణం అనంతరం ఎన్టీఆర్ జీవితంలో భాగస్వామిగా మారిన లక్ష్మీ పార్వతి దృష్టికోణంలో సాగే ఈ చిత్రం కోసం మొట్టమొదటిసారిగా ఆర్జీవీ డైరెక్టర్ క్రెడిట్ ను అగస్త్య మంజు అనే తన అసిస్టెంట్ తో షేర్ చేసుకోవడం గమనార్హం. ఈమధ్యకాలంలో ఈ సినిమా గురించి జరిగినంత రచ్చ మరే ఇతర విషయంలోనూ జరగలేదు కాబట్టి.. ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా ఆసక్తి మాత్రం పెరిగింది. మరి ఆర్జీవీ ఈసారి ఏం చేశాడో చూడండి…!!
కథ: తన భార్య బసవతారకం మరణించడం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఎన్టీఆర్ చెంతకు ఆయన జీవితాన్ని పుస్తకంగా వ్రాసేందుకు వచ్చిన లక్ష్మీ పార్వతి.. అనంతరం ఆయన జీవిత భాగస్వామిగా ఎలా మారింది? ఆ తరుణంలో ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్లు ఎన్టీఆర్ ను ఎలా ఎదిరించారు? ఆ కారణంగా ఆయన ఎంత మనోవేదనకు గురయ్యారు? చివరికి ఎలా మరణించారు? వంటి అంశాల నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
నటీనటుల పనితీరు: సీనియర్ ఎన్టీఆర్ గా నటించిన పి.విజయ్ కుమార్ కి రంగస్థల నేపధ్యం ఉండడంతో.. ఆయన పలికించిన హావభావాలు, మ్యానరిజమ్స్, ఆహార్యం అన్నీ ఎన్టీఆర్ ను తలపిస్తాయి. ఎక్కడా అతి చేయకుండా ఎన్టీఆర్ పాత్రకు న్యాయం చేశారాయన.
లక్ష్మీ పార్వతి అప్పుడెలా ఉండేదో ప్రస్తుత తరానికి తెలియదు కాబట్టి.. ఆర్జీవి సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువగా తీసుకొని ఆమె పాత్రను రియాల్టీకి చాలా దూరంగా తెరకెక్కించాడనేది చరిత్ర తెలిసినవారి విశ్లేషణ. ఆ పాత్రకు యజ్ణ శెట్టి మాత్రం తన శక్తికి తగ్గ న్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ ఆహార్యం పరంగా, హావభావాల పరంగా పూర్తిస్థాయిలో ఒదిగిపోయాడు. యంగ్ చంద్రబాబుగా “ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాల్లో రాణా ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడో.. అదే స్థాయిలో మధ్య వయస్కుడైన చంద్రబాబుగా శ్రీతేజ్ అద్భుతంగా నటించాడు.
సాంకేతికవర్గం పనితీరు: కళ్యాణ్ కోడూరి సంగీతం, నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించాయి. రమ్మీ సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా బాగుంది కానీ.. ఎమోషనల్ డెప్త్ మాత్రం తీసుకురాలేకపోయింది. సిరాశ్రీ పాటలు, నరేంద్ర చారి మాటల్లో సహజత్వం కంటే చంద్రబాబు మరియు టి.డి.పి పార్టీ కార్యకర్తల మీద దుమ్మెత్తిపోయడమే ఎక్కువగా కనిపించింది, వినిపించింది.
ఇక దర్శక ద్వయం ఆర్జీవి-అగస్త్యలు ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాలను ధైర్యంగా ప్రొజెక్ట్ చేసిన విధానం కొందరికి నచ్చకపోవచ్చు కానీ.. కొంతమేరకు అవి నిజమే అని చెప్పాలి. కాకపోతే.. నాటకీయత మరీ ఎక్కువవ్వడంతో నిజం కూడా అతిగా అనిపిస్తుంది. రాజకీయపరమైన అనుభవం, 90లలో జరిగిన మారిన రాజకీయ సమీకరణల గురించి కనీస స్థాయి ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళెవరూ “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను చూడలేరు. ముఖ్యంగా చంద్రబాబు అభిమానులు సినిమా చూసి ఆర్జీవి మీదకు దండెత్తుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చంద్రబాబును ఒక పోలిటికల్ విలన్ గా ప్రొజెక్ట్ చేసిన విధానం అలాంటిది. అయితే.. రాజకీయ పరిజ్ణానమ్ లేనివారికి మాత్రం “ఓహో ఇలా జరిగిందా?” అని నమ్మేంత నమ్మశక్యంగా చిత్రాన్ని తెరకెక్కించాడు ఆర్జీవి.
సో, “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనేది ఆర్జీవి చెప్పిన లక్ష్మీపార్వతి దృష్టికోణంలో సాగే ఎన్టీఆర్ చరిత్ర. నిజనిజాలు పక్కన పెడితే.. స్లో స్క్రీన్ ప్లే మాత్రం బోర్ కొట్టిస్తుంది. సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువవ్వడంతో కాస్త చిరాకు కూడా పుడుతుంది.
విశ్లేషణ: ఎలక్షన్స్ టైమ్ కాబట్టి ఏదో ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ లో సినిమాని తీస్తే యాంటీ ఫ్యాన్స్ చూసినా చాలు డబ్బులు వచ్చేస్తాయి అనే ఉద్దేశ్యంతో తీసిన సినిమానే తప్ప.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనేది ఏ యాంగిల్ లో చూసినా “అసలు కథ” అనిపించదు. పైగా.. సినిమా మొత్తానికి ఆర్జీవీ మార్క్ కెమెరా ఫ్రేమింగ్ కానీ యాంగిల్ కానీ ఒక్కటి కూడా కనిపించకపోవడంతో ఈ సినిమా ఆర్జీవీయే తీశాడా అనే డౌట్స్ కూడా వస్తాయి.
రేటింగ్: 1/5