2021 Best Movies: 2021లో ప్రేక్షకుల్ని మెప్పించిన స్టార్ హీరోలు!

  • January 4, 2022 / 11:07 AM IST

2021 చాలా మంది హీరోలకు కెరీర్ కి ఒక కలికితురాయి. కొందరు హీరోలు తమ ఉనికిని చాటుకుంటే.. ఇంకొందరు హీరోలు తమ మార్కెట్ ను పెంచుకున్నారు. అలా ఈ ఏడాది సక్సెస్ & స్టార్ డమ్ సొంతం చేసుకున్నా కొందరు హీరోలు ఎవరో చూద్దాం..!!

రవితేజ (క్రాక్)

సరైన హిట్ లేక కొట్టుమిట్టాడుతున్న రవితేజ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం క్రాక్. అయితే.. ఆ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ పెర్ఫార్మెన్స్ & యాక్షన్ సీన్స్ లో రవితేజ మ్యానరిజమ్స్ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాయి.

అల్లరి నరేష్ (నాంది)

నటుడిగా అల్లరి నరేష్ కు లైఫ్ ఇచ్చిన సినిమా “నాంది”. ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం, ఆఖరికి డబ్బింగ్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు అతడ్ని హీరోగా మంచి స్థాయిలో నిలబెట్టాయి.

వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

“ఉప్పెన” చూసిన ఎవ్వరైనా ఇది ఈ అబ్బాయి మొదటి సినిమా అంటే నమ్మడం కష్టం. సాధారణ ప్రేమకథ అయినప్పటికీ.. చక్కని పరిణితి ప్రదర్శించాడు. రెండో సినిమా “కొండపొలం”తోనూ నటుడిగా ఎదిగాడు. ఇలాగే కంటిన్యూ అయితే.. మెగా ఫ్యామిలీ నుంచి మరో ప్రామిసింగ్ హీరోగా వైష్ణవ్ నిలవడం ఖాయం.

నవీన్ పోలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ (జాతిరత్నాలు)

జాతి రత్నాలు సినిమాలు ఒకరు హీరో, ఒకరు ఫ్రెండ్ అని విడదీయడానికి అవకాశం ఉండదు. ఆ స్థాయిలో ముగ్గురూ హాస్యాన్ని పండించారు. థియేటర్లలో జనాలు ఈ రేంజ్ లో నవ్వి చాలా రోజులైందని చెప్పాలి. దాదాపుగా సినిమా మొత్తం జనాలు నవ్వుతూనే ఉన్నారు. అందుకు వీళ్ళ ముగ్గురి నటనే కారణం.

రాణా (అరణ్య)

ఈ సినిమా కోసం రాణా పడిన కష్టం ఇప్పటివరకూ ఎవరూ పడలేదు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే అతడి హెల్త్ పాడయ్యింది. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ షూటింగ్లో జాయినయ్యాడు. నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు.

వెంకటేష్ (నారప్ప)

ధనుష్ కు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన పాత్రను వెంకటేష్ ఎలా చేయగలడు అని తమిళ ఆడియన్స్ నవ్వారు. ఆ నవ్విన వాళ్లందరికీ తన నటనతోనే సమాధానం చెప్పి, తన సీనియారిటీని నిరూపించుకున్నాడు వెంకీ మామ. రెండు వేరియేషన్స్ ఉన్న నారప్ప క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు.

శ్రీవిష్ణు (రాజ రాజ చొర)

“బ్రోచేవారెవరురా” చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చిన శ్రీవిష్ణు.. “రాజ రాజ చోర”తో మరోసారి నటుడిగా తన స్టామినాను ప్రేక్షకులకు రుచి చూపించాడు. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా పండించగలనని ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. భర్తగా, ప్రియుడిగా, తండ్రిగా, దొంగగా పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో పెర్ఫార్మ్ చేసాడు.

నితిన్ (మ్యాస్ట్రో)

ఒక జాతీయ స్థాయి నటుడు పోషించిన పాత్రతో మళ్ళీ రంజింపజేయడం అనేది సాదాసీదా విషయం కాదు. నితిన్ ఆ మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడంలో విజయం సాధించాడు. “అంధాదున్”ను దాదాపుగా అన్నీ భాషల్లో రీమేక్ చేసినప్పటికీ.. తెలుగు వెర్షన్ లో నితిన్ తరహాలో మిగతా భాషల నటులు ఆ పాత్రను పండించలేకపోయారనే చెప్పాలి.

సాయిధరమ్ తేజ్ (రిపబ్లిక్)

ఒక బాధ్యతగల సినిమాలో నటించే నటుడి కళ్ళల్లోనూ అదే బాధ్యత కనిపించాలి. “రిపబ్లిక్”లో సాయితేజ్ కళ్ళల్లో ఆ నిక్కచ్చితనం కనిపిస్తుంది. సినిమాకి దేవాకట్టా డైరెక్షన్ ఒక హైలైట్ అయితే.. ఆ సినిమాలో సాయితేజ్ నటన మరో హైలైట్. కమర్షియల్ హంగులు లేని సినిమాని తన నటనతో ఆకట్టుకునే విధంగా చేసాడు.

బాలకృష్ణ (అఖండ)

అసలు బాలయ్య అంటేనే ఒక ఎమోషన్. అలాంటి బాలయ్య స్లోగన్ ను ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా “అఖండ”. అఘోర పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం. ఫైట్స్ & డ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ ను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించింది. హీరో ఆఫ్ ది ఇయర్ గా బాలయ్యను నామినేట్ చేసినా తప్పులేదు.

అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)

నటుడిగా అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” చిత్రంతోనే పతాకస్థాయి ప్రదర్శన ఇచ్చాడు. “పుష్ప”లో తన ఊరమాస్ యాంగిల్ ను ఆడియన్స్ ను పరిచయం చేసాడు. ఒక మాస్ క్యారెక్టర్ ను ఇంతకంటే మాసీగా మరెవరూ చేయలేరు అనే స్థాయిలో చేసాడు బన్నీ. ముఖ్యంగా క్లైమాక్స్ రైటింగ్ సోసోగా ఉన్నా.. బన్నీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇరగ్గొట్టేసాడు.

నాని (శ్యామ్ సింగరాయ్)

నటుడిగా నానిని సరికొత్తగా చూసి చాలా ఏళ్లైపోయింది. ఈమధ్యకాలంలో నాని సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి.. ముఖ్యంగా నాని వేరియేషన్స్ చూపించడం లేదు అని విశ్లేషణలు వచ్చాయి. వాటిని కాస్త సీరియస్ గా తీసుకున్న నాని “శ్యామ్ సింగరాయ్”తో సమాధానం ఇచ్చాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus