బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ క్రికెటర్ కెఎల్ రాహుల్ రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ముంబై సమీపంలో ఖండాలాలో అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి చెందిన ఫామ్ హౌస్ లో వీరి వివాహం జరిగింది. తక్కువ మంది అతిథులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది. త్వరలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎల్ 2023 ముగిసిన తరువాత రిసెప్షన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులకు బాలీవుడ్ నటులు, ఇండియన్ క్రికెటర్స్, ఫ్యామిలీ నుంచి ఖరీదైన గిఫ్ట్స్ వచ్చాయట. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖరీదైన బైక్ ని గిఫ్ట్ గా పంపించారట. అలానే భారత క్రికెటర్ల నుంచి కూడా కొన్ని గిప్ట్స్ వచ్చినట్లు సమాచారం.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ కొత్త జంటకి రూ.1.6 కోట్లు విలువైన ఆడీ కారుని గిఫ్ట్ గా ఇచ్చారట. యంగ్ హీరో అర్జున్ కపూర్ డైమండ్ నెక్లెస్, జాకీ ష్రాఫ్ రూ.30 లక్షల విలువైన వాచ్ ని అతియా శెట్టికి గిఫ్ట్ గా ఇచ్చారట. అలానే సునీల్ శెట్టి స్నేహితులు, అతియా ఫ్రెండ్స్ నుంచి కూడా కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
అతియా ఫ్యామిలీ నుంచి కెఎల్ రాహుల్-అతియా శెట్టిలకు సుమారు రూ.50 కోట్ల లగ్జరీ ఫ్లాట్ గిఫ్ట్ గా వచ్చిందట. ముంబైలో ఈ అపార్ట్మెంట్ ఉంది. అతియా, రాహుల్ ఇదే ఫ్లాట్ లో ఉండే అవకాశం ఉంది. ఇక రిసెప్షన్ టైంకి ఈ గిఫ్ట్స్ నెంబర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.