“16D” ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మారన్”. ధనుష్-మాళవిక మోహనన్ జంటగా నటించిన ఈ చిత్రం నేడు (మార్చి 11) హాట్ స్టార్ యాప్ లో విడుదలైంది. పోలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కానీ కంటెంట్ కానీ ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి కలిగించలేకపోయాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: మారన్ (ధనుష్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తండ్రి నుంచి నీతి నిజాయితీ పుణికిపుచ్చుకున్న మారన్ ఓ అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి చీకటి కోణాన్ని, రానున్న ఎన్నికల్లో అతడు చేయబోయే మోసాన్ని జనాలకి చూపించే ప్రయత్నం చేస్తాడు.
ఆ కారణంగా మారన్ ఏం కోల్పోవాల్సి వచ్చింది? ఆ కష్టాన్ని దిగమింగుకొని మారన్ సదరు రాజకీయ నాయకుడ్ని ఎలా ఎదిరించాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: సాధారణంగా తాను నటించే ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇచ్చే ధనుష్.. ఈ చిత్రంలో మాత్రం ఎందుకో నీరసంగా కనిపించాడు. పాత్ర మీద సరైన అవగాహన లేకపోవడమా లేక పాత్రలో పెద్దగా డెప్త్ లేకపోవడమా అనేది తెలియదు కానీ.. ధనుష్ మాత్రం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టినట్లు కనిపించలేదు.
మాళవిక మోహనన్ తన ఇన్స్టాగ్రామ్ ఫోటోషూట్లలో కనిపించినంత అందంగా ఈ చిత్రంలో కనిపించలేదు. అలాగే ఆమె పాత్ర కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తమన్నా క్యారెక్టరైజేషన్ ను గుర్తుకుచేస్తుంది.
సముద్రఖనికి పవర్ రోల్ దొరికింది కానీ.. దాని క్యారెక్టర్ ఆర్క్ బాలేదు. అందువల్ల ఆ పాత్ర పండలేదు.
సాంకేతికవర్గం పనితీరు: బేసిగ్గా సినిమాలో కంటెంట్ లేనప్పుడు టెక్నికల్ గా ఎంత బాగున్నప్పటికీ.. అవన్నీ ఎలివేట్ అవ్వవు. కానీ.. “మారన్” విషయంలో ఒక్క కెమెరామెన్ తప్ప ఎవరూ తమ బెస్ట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. జి.వి.ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం కూడా బాగోలేకపోవడం ఆశ్చర్యకరం. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, సీజీ వర్క్ మరీ పేలవంగా ఉన్నాయి.
దర్శకుడు కార్తీక్ నరేన్ “రంగం” సినిమానే మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి తీశాడు అనిపిస్తుంది. కథలో బలమైన పాయింట్ కానీ, క్యారెక్టర్స్ లో డెప్త్ కానీ, స్క్రీన్ ప్లేలో ఎమోషన్ కానీ బూతద్ధం పెట్టి వెతికినా కనిపించదు. పైగా.. కంగారుకంగారుగా ముగించిన క్లైమాక్స్ అండ్ చివర్లో ఇచ్చిన అనవసరమైన ట్విస్ట్, ఇమడలేకపోయిన సిస్టర్ సెంటిమెంట్. ఇలా పలువిధాల్లో దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రేక్షకుల్ని కనీస స్థాయిలోనూ మెప్పించలేకపోయాడు.
విశ్లేషణ: ఒక పోలిటికల్ థ్రిల్లర్ కి లాజిక్, ఎమోషన్, ట్విస్ట్స్, క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఇవేమీ లేకుండా తెరకెక్కిన చిత్రం “మారన్”. మరీ బోర్ కొడితే తప్ప.. ఈ చిత్రాన్ని ఒటీటీలో చూడడం కూడా కష్టమే.
రేటింగ్: 1/5