మహర్షి

  • May 9, 2019 / 12:45 PM IST

మహేష్ బాబు 25వ ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందిన “మహర్షి” భారీ అంచనాల నడుమ ఇవాళ విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్-వైజయంతీ మూవీస్-పి.వి.పి సినిమాస్ నిర్మించడం విశేషం. మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటిసారిగా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన ఈ చిత్రంపై మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకొన్నారు.. వారి అంచనాలను సినిమా అందుకోగలిగిందా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!

కథ: ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు రిషి (మహేష్ బాబు). చిన్నప్పట్నుంచి తన తండ్రి సూర్యనారాయణ (ప్రకాష్ రాజ్) ఆ మధ్యతరగతి బ్రతుకు కారణంగా పడిన కష్టాల్ని, చవిచూసిన అవమానాల్ని గమనించి.. తాను మాత్రం తారా స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. అందుకోసమే అనుక్షణం పరితపిస్తుంటాడు. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాడు.

కానీ.. ఆ గమ్యం చేరుకొనే ప్రయాణంలో తన అనుకున్నవాళ్లని పోగొట్టుకొంటాడు, కొందర్ని బాధపెడతాడు, ఇంకొందర్నీ ఇబ్బంది పెడతాడు. ఇందరిని బాధపెట్టి తాను సాధించిన గెలుపు తాను అనుకున్న విజయం లెక్కలోకి రాదని గ్రహించి తన ప్రయాణాన్ని పునఃప్రారంభిస్తాడు. అలా మొదలైన రిషి జర్నీ ఎలాంటి మలుపులు తీసుకొంది? చివరికి ఎక్కడికి చేరింది? ఈ జర్నీలో రిషి తనని తాను ఎలా తెలుసుకొన్నాడు? అనేది “మహర్షి” కథ.

నటీనటుల పనితీరు: మహేష్ బాబు ఒక నటుడిగా కంటే ఒక వ్యక్తిగా ఎక్కువ మెచ్యూర్డ్ గా కనిపించాడు ఈ చిత్రంలో. ముఖ్యంగా ఎం.టెక్ స్టూడెంట్ గా భలే ఈజ్ తో కనిపించాడు. ఇక సి.ఈ.ఓ గా సూపర్ స్టైలిష్ గా అభిమానులను అలరించాడు. కానీ.. చివరి 30 నిమిషాల్లో ఒక సాధారణ రైతుగా నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించేశాడు మహేష్. ముఖ్యంగా నాగలి పట్టి భూమిని దున్నే సన్నివేశాలు మరియు రైతుల్లో ఒకడిగా కలిసిపోయే సందర్భాల్లో మహేష్ బాబు అద్భుతంగా ఒదిగిపోయాడు. ఒక సూపర్ స్టార్ హీరో సమాజానికి తన సినిమాల ద్వారా మంచి సందేశం ఇవ్వడం అనేది అభినందనీయమే కాదు హర్షణీయం కూడా.

పూజ హెగ్డేకు పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ.. ఉన్నంతలో చక్కగానే నటించింది. అల్లరి నరేష్ మంచి నటుడు అని చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే “నేను” సినిమాతోనే తాను సంపూర్ణ నటుడ్నని నిరూపించుకొన్న సమర్ధుడు నరేష్. “మహర్షి”లో నరేష్ పాత్ర చాలా కీలకమే అయినప్పటికీ.. మహేష్ బాబు చర్మిష్మా ముందు మాత్రం కాస్త తేలిపోయాడు. కానీ.. ఇద్దరి కాంబినేషన్ & కెమిస్ట్రీ మాత్రం తెరపైక్ చూడ్డానికి చాలా బాగుంది.

మంచి తండ్రిగా ప్రకాష్ రాజ్, కొడుకును అర్ధం చేసుకొనే తల్లిగా జయసుధ, మినీ విలన్ గా జగపతిబాబులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మోహనన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది కానీ.. మహేష్ బాబును స్టైలిష్ & కలర్ ఫుల్ గా చూపించడం మీద పెట్టిన శ్రద్ధ ఫ్రేమింగ్స్ మీద పెట్టినట్లుగా కనిపించదు. అందువల్ల తెరపై మహేష్ బాబు అందంగా కనిపిస్తున్నందుకు ఆనందించాలో.. కెమెరా ఫ్రేమింగ్స్ అన్నీ కొన్ని పాత సినిమాలను తలపిస్తున్నాయని బాధపడాలో అర్ధం కాక ఇబ్బందిపడుతుంటారు ప్రేక్షకులు. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ రాజీపడలేదు అని ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తూనే ఉంటుంది. కలర్ గ్రేడింగ్ & డి.టి.ఎస్ మిక్సింగ్ విషయంలో తీసుకొన్న స్పెషల్ కేర్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియస్ ను ఇస్తుంది.

ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకున్న కథ ద్వారా సమాజానికి రైతుల గురించి, వారి కష్టాల గురించి తెలియజేయాలనే తపన అర్ధమవుతుంది కానీ.. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అందుకు కారణం కమర్షియల్ ఎలిమెంట్స్ ను మరీ ఎక్కువగా సినిమాలోకి జొప్పించడానికి ప్రయత్నించడం, మహేష్ బాబు ప్రతి క్లోజప్ షాట్ ను స్లోమోషన్ లో చూపించి అభిమానుల్ని ఖుషీ చేయాలనుకున్న వంశీ ఆలోచన బాగుంది కానీ.. అందువల్ల సినిమా మరీ ఎక్కువగా సాగిందనే విషయాన్ని కూడా గమనిస్తే బాగుండేది. మూల కథకి మంచి వేల్యూ ఉన్నప్పటికీ.. కథనం మాత్రం “శ్రీమంతుడు” చిత్రాన్ని వద్దన్నా గుర్తుచేస్తుంది. అందువల్ల కొన్ని సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు ఆ సినిమాను గుర్తుచేస్తాయి.

“రైతులకు కావాల్సింది సింపతీ కాదు, రెస్పాక్ట్ & ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు.. మరి రైతు ఏడిస్తే దేశానికి మంచిదా?” లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా వ్యవసాయం అనేది సమాజానికి మాత్రమే కాదు మనిషి జీవితానికి ఎంత ముఖ్యం అనేది వివరించిన విధానం బాగుంది. కానీ.. కాంర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోవడం, కథనం మరీ సాగడం, క్యారెక్టరైజేషన్ కి ఒక కరెక్ట్ వేవ్ లెంగ్త్ అనేది లేకపోవడంతో నాన్ స్టాప్ బస్ లా సాగాల్సిన “మహర్షి” జర్నీ పల్లెవెలుగు బస్ లో ప్రయాణాన్ని తలపిస్తుంది. స్క్రీన్ ప్లే & ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే.. “ఇదీ రైతులు ఎదుర్కొంటున్న సమస్య” అని కాస్త గట్టిగానే చెప్పిన వంశీ పైడిపల్లి.. ఆ సమస్యకు సరైన సొల్యూషన్ మాత్రం చెప్పలేకపోవడం గమనార్హం.

విశ్లేషణ: మహేష్ బాబు అభిమానుల వరకూ “మహర్షి” ఒక మెమరబుల్ జర్నీగానే మిగిలిపోతుంది. కానీ.. రెగ్యులర్ మూవీ లవర్స్ కి మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఎంగేజ్ చేయలేదు. మొదటి రెండు వారాల వరకూ టికెట్ రేట్లు పెంచేసిన కారణంగా కమర్షియల్ గా సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంది. అయితే.. మహేష్ బాబు కెరీర్ లో మైలురాయి చిత్రంగా నిలవాల్సిన సినిమా ఒక సగటు కమర్షియల్ హిట్ గా మిగిలిపోవడం గమనార్హం.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus