భరత్ అనే నేను విజయం సాధించడంతో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆనందంగా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లోని అభిమానులను కలుసుకుని సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈరోజు దర్శకుడు కొరటాల శివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజయవాడకు వెళ్లారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడలోని డీవీ మానర్ హోటల్‌లో మహేశ్‌బాబు శుక్రవారం చిన్నారులను కలిశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా ఫీలవుతాను.
ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే జరిగాయి. `భరత్ అను నేను` చిత్రానికి ఘన విజయం అందించిన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో నన్ను నా తండ్రి కృష్ణతో పోల్చడం ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్పారు. “వెండితెరపై సీఎం గా ఆకట్టుకున్నారు.. నిజజీవితంలో రాజకీయంలోకి ఎప్పడొస్తార”ని అభిమానులు కోరగా ఆసక్తికర సమాధానం చెప్పారు. “నేను వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తాను. రాజకీయాల్లోకి రాను” అని మహేష్ మరో మారు స్పష్టం చేశారు.