వెండితెరపై హీరోగా అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తెరవెనుక కూడా హీరో అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఈయన హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండడమే కాకుండా భారీగా సంపాదిస్తున్నారు కూడా. ఇలా మహేష్ బాబు సంపాదనలో కొంత భాగం మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈయన ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తిరిగి వారికి ఊపిరి పోస్తున్నారు.
ఈ విధంగా మహేష్ బాబు (Mahesh Babu) తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో రెండేళ్ల చిన్నారి పట్ల మహేష్ బాబు మంచి మనసు చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నటువంటి రెండేళ్ల చిన్నారికి ఈయన తన ఫౌండేషన్ ద్వారా సర్జరీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రెండేళ్ల కార్తికేయ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అయితే ఆ బాబుని తల్లిదండ్రులు పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా తన గుండెలో రంద్రం ఉందని వెంటనే సర్జరీ చేయాలని తెలియజేశారు.
దీంతో ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న చిన్నారి తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారి సహాయంతో మహేష్ బాబు ఫౌండేషన్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ బాబుతో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వాహకులను కలవడంతో వెంటనే చిన్నారికి ఆంధ్ర హాస్పిటల్ లో వైద్యులు సర్జరీ చేశారు. దీంతో చిన్నారి ప్రాణాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు పరీక్షించిన అనంతరం చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.
ఇలా తమ కుమారుడికి సర్జరీ చేయించి ప్రాణాలు కాపాడటంతో చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియడంతో మరోసారి మహేష్ బాబు మంచితనంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.