చండ్రు మనోహరన్ - అనురాగ్ రెడ్డి - శరత్ చంద్ర (Producer)
కళ్యాణ్ నాయక్ (Music)
శ్యామ్ దూపాటి (Cinematography)
Release Date : మే 26, 2023
సినిమా ట్రైలర్, పాటలు, ప్రోమోల కంటే ఎక్కువగా ప్రమోషన్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన చిత్రం “మేమ్ ఫేమస్” (Mem Famous). దాదాపుగా హైద్రాబాద్ లో నివాసముంటున్న అందరు సినిమా సెలబ్రిటీలతో స్పెషల్ డ్యాన్స్ వీడియోలతో సినిమాను ప్రమోట్ చేసి విశేసమైన బజ్ క్రియేట్ చేశారు. అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ “మేమ్ ఫేమస్” ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది?, సినిమాలో క్రియేటివిటీ ప్రమోషన్స్ రేంజ్ లో ఉందా? అనేది చూద్దాం..!!
కథ: బండనర్సంపల్లి అనే గ్రామంలో జులాయిగే తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలకృష్ణ (మౌర్య). పొద్దస్తమానం ఊర్లో లేదా చుట్టుపక్కల ఊర్లలో లేనిపోని గొడవలు పెట్టుకొని వాళ్ళ ముక్కులు పగలకొట్టడం, రాత్రిపూట అంజిమామ (అంజి మామ) ట్రాక్టర్ షెడ్ లో కూర్చొని మందు కొట్టడం, తెల్లారే పంచాయితీలో తిట్లు తినడం. ఇదీ వీళ్ళ దినచర్య.
ఔలాగాళ్ళ నుండి ఔరా అనిపించుకొనే స్థాయికి ఈ ముగ్గురూ ఎలా ఎదిగారు? అనేది “మేమ్ ఫేమస్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఇదివరకు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవమున్న సుమంత్ ప్రభాస్ కెమెరా ముందు ఏమాత్రం జంకలేదు. నటుడిగా ఇది అతడి తొలి సినిమానా అని ఆశ్చర్యపోయేంత ఈజ్ తో నటించాడు. అతడి స్నేహితుల పాత్రల్లో నటించిన మౌర్య & మణి కూడా ఆకట్టుకున్నారు. పల్లెటూరు యువతి మౌనిక పాత్రలో సార్య చాలా సహజంగా ఒదిగిపోయింది. సిరి రాశి కూడా పర్వాలేదనిపించుకుంది. లిప్స్టిక్ స్పాయిలర్ లింగంగా శివ నందన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
సినిమాలో కాస్త సీనియర్లు మురళీధర్ గౌడ్, అంజిమామలు సినిమాకి మెయిన్ ఎస్సెట్స్ గా నిలిచారు. వారి పాత్రల ద్వారా పండిన హాస్యాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు.
అయితే.. వీళ్ళందరి పాత్రల్లో ఎవరికీ సరైన క్యారెక్టర్ ఆర్క్ లేదు, ఉన్న కొద్ది మందికీ అది సరిగా ఎలివేట్ అవ్వలేదు. అందువల్ల.. పాత్రలుగా ఎవరూ కనెక్ట్ అవ్వరు. గుంపుగా మాత్రం ఒకే అనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి గురించి మాట్లాడుకోవాలి. ఇంత తక్కువ బడ్జెట్ లో.. ఈ అవుట్ పుట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. తనకున్న లిమిటేషన్స్ ను పరిగణలోకి తీసుకొంటే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడనే చెప్పాలి. కాకపోతే.. అవకాశం ఉన్న చోట కూడా కాస్త వైవధ్యంగా ప్రయత్నించకుండా.. స్టాండర్డ్ ఫ్రేమ్స్ తో కాస్త నిరాశపరిచాడు. ఫ్రేమింగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడితే బాగుండేది.
కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఎందుకో సరిగా వర్కవుటవ్వలేదు. నిన్న ప్రీమియర్ వేసిన థియేటర్స్ (సంధ్య, హైటెక్) సౌండ్ సిస్టమ్స్ వల్ల అని బృందం సర్ధి చెబుతున్నారు. అయితే.. పాటలతో పోల్చి చూస్తే.. నేపధ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేయడంలో విఫలమైందనే చెప్పాలి.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. చాలా సింపుల్ గా ఒక గ్రామంలో సినిమా మొత్తాన్ని లాగించేశారు. అందువల్ల.. నేచురాలిటీ ఎక్కడా మిస్ అవ్వలేదు. అదో ప్లస్ పాయింట్.
ఇక దర్శకుడు-కథానాయకుడు-రచయిత సుమంత్ ప్రభాస్ పనితనం గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ చెప్పాలంటే.. సినిమాలో క్యారెక్టర్స్ & స్టోరీ విషయంలో మరీ డెప్త్ లేకుండా చాలా సింపుల్ గా కథ-కథనాన్ని రాసుకున్న విధానం బాగుంది. అలాగే.. ఒకడు ఎదగాలి అనుకుంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా సహాయపడతారు అనే విషయాన్ని చాలా పాజిటివ్ గా చూపించిన విధానం కూడా బాగుంది. అయితే.. ఏ ఒక్కరి క్యారెక్టర్ కు సరైన ఆర్క్ లేకపోవడం అనేది మైనస్. ఎంత టైమ్ పాస్ సినిమా అయినప్పటికీ.. పాత్రలకు ఒక జస్టిఫికేషన్ ఉండాలి. “జాతిరత్నాలు, బలగం” లాంటి సినిమాలకు హెల్ప్ అయ్యింది ఆ జస్టిఫికేషనే. అలాగే.. కామెడీ సీన్స్ వర్కవుట్ చేయడం అంత ఈజీ కాదని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది.
ఒక్క అంజిమామ లవ్ స్టోరీ & కొన్ని డైలాగ్స్ తప్ప థియేటర్లో జనాలు విరగబడి నవ్విన పంచ్ లైన్లు కానీ కామెడీ సీన్స్ కానీ సినిమాలో పెద్దగా లేవనే చెప్పాలి. అలాగే.. బబ్బీ పాత్ర ఎంగేజ్ మెంట్ & మౌనిక లవ్ స్టోరీకి సుమంత్ రాసుకున్న జస్టిఫికేషన్ రచయితగా అతడి ఇమ్మెచ్యూరిటీకి అద్ధం పట్టింది. నటుడిగా, దర్శకుడిగా ఫర్వాలేదనిపించుకున్న సుమంత్ ప్రభాస్.. రచయితగా మాత్రం బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడు.
విశ్లేషణ: “మేమ్ ఫేమస్”లో మోస్తరు కామెడీ, మంచి ఎమోషన్ & యూత్ కోరుకునే చాలా అంశాలున్నాయి. అయితే.. ఈ అంశాలను ఒక తాటిపై నిలపాల్సిన కథనం మాత్రం లోపించింది. అందువల్ల సినిమా సాగుతున్న భావన ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు సినిమాలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యింది. సో, ఆ ల్యాగ్ & కొంత కామెడీని పట్టించుకోకుండా ఎమోషన్ కు కనెక్ట్ అయితే.. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా “మేమ్ ఫేమస్”ను ఎంజాయ్ చేయగలరు.
రేటింగ్: 2/5
Click Here To Read in ENGLISH
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus