అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా మనం సైతం పనిచేస్తోందన్నారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా కార్యక్రమాలు గురువారం సాయంత్రం ఫిలింఛాంబర్ లో జరిగాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడుగురు ఆపన్నులకు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, హను రాఘవపూడి, ఇంద్రగంటి మోహనకృష్ణ, దిల్ రాజు, కోటగిరి వెంకటేశ్వరరావు, మహాటీవీ మూర్తి, నవీన్ యాదవ్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. కిడ్నీలు ఫెయిలై బాధపడుతున్న జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ రవివర్మకు 25 వేల రూపాయలు, కంటి చూపు రుగ్మతతో బాధపడుతున్న ఎడిటర్ టీఎల్వీ రమణయ్యకు 70 వేల రూపాయలు, బ్రయిన్ స్ట్రోక్ బారిన పడిన కో డైరక్టర్ వెంకటేశ్వరరావు, మేకప్, హేయిర్ స్టైలిస్ట్ కుమారస్వామి బాబు వైద్య ఖర్చులకు, డ్రైవర్స్ యూనియన్ సభ్యుడు జహారుల్లా కిడ్నీ వ్యాధి చికిత్సకు, చిత్రపురి కాలనీ టెక్నీషియన్ శేఖర రెడ్డి, ప్రమాదంలో కాలు గాయంతో బాధపడుతున్న అర్చకులు జంధ్యాల శ్రీశైలపతి శర్మ వైద్య ఖర్చులకు తలా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మనం సైతం అందజేసింది. ఈ చెక్ లను అతిథుల చేతుల మీదుగా కాదంబరి కిరణ్ పేదవారికి అందించారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…34 ఏళ్లుగా కెమెరా ముందు ప్రశంసలు అందుకున్నాను. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు నైట్ వాచ్ మెన్ గా ఉంటున్నాను. ఇక్కడ మంచి వాళ్లు, చెడ్డవాళ్లు అంతా తెలుసు. చెడ్డవాళ్లను దూరంగా పంపించాను, మంచివాళ్లకు వంగి వంగి దండాలు పెడుతున్నాను. ఇది గమనించిన వాళ్లు గ్రేట్, లేని వాళ్ల విషయంలో నో రిగ్రెట్. నా శరీరం నిండా రక్తపు మరకలే. ఎన్నో గాయాలు, అనుభవాలు. మనిషికి మనిషి శత్రువు కావాలంటే ఒక్క చూపు చాలు. అదే హితుడు కావాలంటే ఎన్నో ఏళ్ల సహవాసం కావాలి, ఒకరినొకరు నమ్మాలి. నా అనుభవాలతో తెలుగు చిత్ర పరిశ్రమ నైట్ వాచ్ మెన్ అనే పుస్తకాన్ని రాయాలనుకున్నాను. కానీ ఆ పుస్తకం రాస్తే ఎన్నో నిజాలు చెప్పాలి. ఎంతో మంది గురించి సత్యాలు రాయాలి. అలా రాస్తే శత్రువును అవుతాను. కానీ ఇవాళ నేనీ పరిస్థితిలో ఉండటానికి ఆ శత్రువులే కారణం. ఎళ్లుగా వ్యక్తులకు సేవ చేశాను. అవి వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోయాయి. కానీ వ్యక్తులకు కాదు సంస్థలను నమ్ముకోవాలి అనుకున్నాను. వెలివేయబడిన వాళ్ల కోసం, దూరంగా పెట్టబడిన వాళ్ల కోసం నిలబడాలనుకున్నాను. ఆ ఆలోచనకు రూపమే మనం సైతం. అందరికీ దగ్గరగా, అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా ఇవాళ మనం సైతం ఎదుగుతోంది. గత మూడు నెలల్లో 25 మందికి సాయం అందించాం. పేదరికం రూపుమాపడం మా వల్ల కాదు…కానీ మా దగ్గరకు వచ్చిన పేదలను ఆదుకుంటూ వాళ్లకు గుండె ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎన్నో కలలతో చిత్ర పరిశ్రమకు వచ్చిన మన కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మహా క్రతువులో భాగం అయ్యేందుకు వచ్చిన పెద్దలందరికీ రుణపడి ఉంటాను. అన్నారు.
మహాటీవీ మూర్తి మాట్లాడుతూ….చిత్ర పరిశ్రమలో కార్మికులకు కష్టం వస్తే కన్నీటి కంటే కాదంబరి కిరణ్ ముందుంటారు. చిత్ర పరిశ్రమలో అంతా బాగుండాలని అప్పట్లో యజ్ఞం చేశారు. అది ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో తెలియదు గానీ…..మనం సైతం సంస్థ ద్వారా కాదంబరి కిరణ్ మహా యజ్ఞం చేస్తున్నారు. ఎంతో మందికి విద్యా వైద్యం అందిస్తున్నారు. గుండెతో స్పందిస్తూ పేదలను ఆదుకుంటున్నారు. అన్నారు.
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ…సాయం చేయాలనుకోవడం అన్నింటికన్నా కష్టమైన పని. అది మొదలైతే కుదురుగా ఉండనివ్వదు. సాయం చేయాలనే ఆకలి ఎప్పటికీ తీరదు. కాదంబరి కిరణ్ నన్ను కలిసినప్పుడల్లా ఎవరో ఒకరి కష్టాల గురించి మాట్లాడుతుంటారు. వాళ్లకు ఎలా సాయం చేసిందీ చెబుతుంటారు. ఆయన వందేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…..మేము సినిమాలను కళాత్మకంగా రూపొందించాలని అనుకుంటాం. కాదంబరి కిరణ్ గారు కళాత్మకంగా జీవిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అతిథిగా రావడమే ఒక అర్హత. అలాంటి అర్హత కలిగించిన కిరణ్ గారికి కృతజ్ఞతలు. అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….కాదంబరి కిరణ్ మమ్మల్ని దీవించండి అంటున్నారు. అలా అనకండి మేము మీ వెనక నడిచేందుకు ఇక్కడికి వచ్చాం. దిల్ సినిమా విడుదలైన ఇవాళ్టికి 15 ఏళ్లవుతోంది. నేను దిల్ రాజుగా మారి 15 ఏళ్లవుతోంది. మనమంతా పుడతాం , ఎన్నో పనులు చేస్తాం, చాలా సంపాదిస్తాం చనిపోతాం. ఆ తర్వాత మన ఫొటోపై పుట్టిన తేదీ, మరణించిన తేదీ , మధ్యలో చిన్న గీత ఉంటుంది. ఆ గీతే మన జీవితం. అది తెలుసుకునే లోపే జీవితం మన చేతిలో నుంచి వెళ్లిపోతుంది. నాకే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ సేవ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో, ఎవరి కష్టం నిజమైనదో తెలియదు. ఎవరైనా నిజాయితీగా చేసే వాళ్లుంటే ప్రతి ఒక్కరం ముందుకొస్తాం. ఇప్పుడు కాదంబరి ఆ పని చేస్తున్నారు. ఆయన ద్వారా మేమంతా సేవా కార్యక్రమాల్లో భాగమవుతాం. మనం సైతం గురించి కాదంబరి నన్ను కలిసి చెప్పారు. తప్పకుండా మీ కార్యక్రమానికి వస్తా అన్నాను. ఈ సంస్థకు ఒక కార్యాలయం ఉండాలి, వ్యవస్థలా ఏర్పడాలి. దానికి నేను సాయం చేస్తాను. మా వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ మనం సైతంలో భాగమయ్యేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇక నుంచి మీ ఫోన్ కాల్ కోసం వేచి చూస్తుంటాను. అవసరమైతే పరిశ్రమ అంతా కలిసి ఓ సినిమా రూపొందించి వచ్చిన ఆదాయాన్ని మనం సైతం సంస్థ ఖాతాలో జమచేస్తాం. సినిమా వల్లే మేమంతా ఎదిగాం. సినిమా లేకుంటే ఎవరం లేము. ఆ సినిమా కార్మికుల కోసం సాయం చేయడం మా బాధ్యత. బాగా చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, ఆ బాధ్యత కిరణ్ వహించాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకులు సుకుమార్ మాట్లాడుతూ….ఒక రోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. మా సహాయ దర్శకుడి స్నేహితుడి భార్య అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని. ఆమె భౌతిక కాయాన్ని విడుదల చేయడం లేదని తెలిసింది. నాకొక సమస్య తెలిసింది అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు. కేవలం డబ్బులిస్తే సరిపోదు అక్కడికి వెళ్లి పనులన్నీ చూడాలి. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి కాదంబరి కిరణ్ గారు. ఆయనకు అర్థరాత్రి ఫోన్ చేస్తే వెంటనే బదులిచ్చారు. నేను చూసుకుంటాను అన్నగారు అన్నారు. ఈలోగా విషయం గురించి చరణ్ కు తెలిసింది. ఆయన ఉదయం నాకు ఫోన్ చేసి మీ సహాయ దర్శకుడి భార్య అపోలో ఆస్పత్రిలో చనిపోయిందట కదా..నేను డబ్బు కట్టేశాను తీసుకెళ్లమని చెప్పండి అన్నారు. అంటే అలాంటి సమయంలో నాకు స్నేహితులు, నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ గుర్తుకు రాలేదు. కేవలం కాదంబరి మాత్రమే గుర్తొచ్చారు. మనం సైతంకు ఎలాంటి సాయం కావాలన్నా మేము భాగమవుతాం. అన్నారు.
మనం సైతం సభ్యులు బందరు బాబీ మాట్లాడుతూ….మనం సైతం కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దిల్ సినిమా విడుదలై 15 ఏళ్లయిన సందర్భంగా దిల్ రాజు గారికి, రంగస్థలం విజయవంతమైన నేపథ్యంలో సుకుమార్ గారికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. అన్నారు.
మనం సైతం సభ్యులు సురేష్ మాట్లాడుతూ….సంస్థ స్థాపించినప్పుడు మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంత కాలం చేయగలం, మన స్థోమత సరిపోతుందా అని భయపడ్డాం. కానీ ఒక్కో చేయీ మాతో కలుస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం ఏర్పడుతోంది. పేదలకు సేవ చేసినప్పుడే పండగ అనే మంచి మనసును కాదంబరి అన్నయ్య మాలో కలిగించాడు. అన్నారు.