రాజకీయ జీవితాన్ని మనోజ్ ప్రారంభించబోతున్నారా ?

  • October 22, 2018 / 01:20 PM IST

“రాయలసీమ వస్తున్న.. రాగి సంగటి.. మటన్ పులుసు రెడీగా పెట్టండి” .. ఇది మంచు మనోజ్ తాజాగా రాసిన లేఖలోని ఆఖరి వాక్యం. ఈ వాక్యంలో ఎంతో అభిమానం దాగుంది. కానీ అంతకముందు అతను రాసిన మాటలే అందరినీ ఆలోచనలో పడేశాయి. “ప్రపంచం మొత్తం తిరిగాను.. ప్రజలకష్టాన్ని చూసాను.. కానీ నాకు తిరుపతి నచ్చింది. అక్కడ ఏదో శక్తి, ప్రశాంతత ఉన్నాయి. వాటన్నిటినీ ప్రపంచం మొత్తం విస్తరించే ప్రయత్నం చేస్తాను” అని ఓ యోగిలా మాట్లాడారు. “అక్కడి రైతులకు అండగా ఉంటాను.. వారి పిల్లలకు విద్యనందిస్తాను” అంటూ రాజకీయనాయకుడిలా వరాలు ఇస్తున్నారు. అంతేకాదు “నా సినీ, రాజకీయ జీవితాలపై తీర్మానాలు చేయవద్దు” అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ లేఖ చదివి మనోజ్ ఆలోచనను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారు.

తిరుపతి ప్రజలకు సేవచేయడానికి తరలివస్తున్నారా? లేకుంటే రాజకీయనాయకుడిగా ఎదగడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది మాత్రం తిరుపతి నుంచి మనోజ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే తిరుపతిలో మంచు మోహన్‌బాబుకు విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ చుట్టూ ప్రజల్లో మంచుఫ్యామిలీపై మంచి అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే నేతగా ఎదగాలని మనోజ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కొంతసమయమే ఉండడంతో ఇప్పటినుంచే రంగంలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు. మరి ఎవరి అంచనా నిజమో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus