మహేష్ నాపై ఎందుకు కోప్పడ్డారో తెలియదు : మణిశర్మ

మెలోడి బ్రహ్మ మణిశర్మ తెలుగులో స్టార్ హీరోలందరికీ సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మణిశర్మ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా మంచి పేరుంది. మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు కి మణిశర్మ అద్భుతమైన పాటలను ఇచ్చారు. అప్పటి నుంచి మహేష్ బాబు మణిశర్మని వదల్లేదు. మురారికి క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఒక్కడు అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత చేసిన అతడు, పోకిరి సినిమాలకు పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతాన్ని అదరగొట్టి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంత మంచి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా ఖలేజా. సినిమా ఆకట్టుకోకపోయినప్పటికీ సంగీతానికి వంక పెట్టలేము. కానీ ఆ చిత్ర సమయంలో మహేష్ కి మణిశర్మ కి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఎందుకు? ఏమిటి అని మహేష్ ని ఎవరూ అడగలేకపోయారు. కానీ ఈ విషయాన్నీ మణిశర్మని అడిగితే అసలు విషయం చెప్పారు. “మహేష్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎక్కువ సినిమాలకు నేనే సంగీతం అందించాను. మా మధ్య మంచి స్నేహం ఉండేది. నా విషయంలో మహేష్ భాదపడ్డాడని తెలిసింది. ఎందుకో తెలియదు. అతన్ని కలిసి ఆ విషయాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు” అని మణిశర్మ వెల్లడించారు. “ఖలేజా మ్యూజిక్ పరంగా హిట్టే .. అయినా మహేష్ నా వంక చూడలేదు. అదే కాదు తీన్మార్, శక్తిలు మ్యూజికల్ హిట్స్. ఆ హీరోలు కూడా నన్ను పక్కన పెట్టారు” అని మణిశర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus