“త్రిష లేదా నయనతార” ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మార్క్ ఆంటోనీ”. తన ట్రేడ్ మార్క్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో విశాల్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషించారు. విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే.. కోర్ట్ కేస్, స్టే పుణ్యమా అని సినిమాకి కావాల్సిన ప్రమోషన్ కూడా లభించింది. ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో బజ్ ఉన్న ఏకైక సినిమా ఇదే. మరి ఆ బజ్ ను సినిమా క్యాష్ చేసుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: ఆంటోనీ (విశాల్) & జాకీ (ఎస్.జె.సూర్య) గ్యాంగ్ స్టర్ ఫ్రెండ్స్. వీళ్ళ బద్ధ శత్రువు ఏకాంబరం (సునీల్) ఛాన్స్ దొరికినప్పుడు ఆంటోనీని చంపేసి పారిపోతాడు. కట్ చేస్తే.. ఆంటోనీ కొడుకు మార్క్ ను తన కొడుకుల పెంచుతాడు జాకీ. ప్రపంచంలో ఎక్కడలేని దరిద్రాలు తనకే వస్తున్నాయి అని బాధపడే మార్క్ జీవితంలోకి ఎంటర్ అవుతాడు చిరంజీవి (సెల్వరాఘవన్).
చిరంజీవి కనిపెట్టిన ఒక ఫోన్ తో గతంలోకి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అని తెలుసుకొని.. తన తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. గతంలో ఆంటోనీని ప్రస్తుత కొడుకు మార్క్ కాపాడుకోగలిగాడా లేదా? అసలు ఆ ఫోన్ వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేది “మార్క్ ఆంటోనీ” కథాంశం.
నటీనటుల పనితీరు: హీరో విశాల్ కంటే ఎస్.జె.సూర్య అదరగొట్టేశాడు. అతడి డైలాగులు, బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. విశాల్ కూడా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. ఎస్.జె.సూర్య ముందు తేలిపోయాడు. సునీల్ మరోమారు హిలేరియస్ కామెడీ రోల్లో ఆకట్టుకున్నాడు. అభినయ నటన & ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. రీతువర్మకి పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. సెల్వరాఘవన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. అతడి నటన మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి తెలుగు సంభాషణలు రాసిన రచయితను మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎస్.జె.సూర్య పంచ్ లు భీభత్సంగా వర్కవుటయ్యాయి. సునీల్ & విశాల్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అడల్ట్ కామెడీ & డార్క్ హ్యూమర్ కి పెట్టింది పేరు. అతడి మునుపటి చిత్రాల వలే “మార్క్ ఆంటోనీ”లోనూ ఆ తరహా సన్నివేశాలు, డైలాగులు పుష్కలంగా ఉన్నాయి. కథగా కంటే కథనంగా సినిమాను అద్భుతంగా రాసుకున్నాడు ఆధిక్. కాకపోతే.. ఈ స్క్రీన్ ప్లే తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా వర్కవుట్ అవుతుంది.
తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలుస్తుంది. మొత్తానికి కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత ఆధిక్ రవిచంద్రన్ మళ్ళీ మరో హిట్ కొట్టాడు. జి.వి.ప్రకాష్ కుమార్ పాటలు తెలుగులో పెద్దగా బాలేవు. కాకపోతే.. నేపధ్య సంగీతంతో మాత్రం సన్నివేశాలకు మంచి హై ఇచ్చాడు. సౌండ్ డిజైన్ విషయంలో తీసుకున్న కేర్ కూడా మెచ్చుకోవాలి. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ వర్క్ బాగున్నాయి.
విశ్లేషణ: ఒక మంచి టైమ్ పాస్ సినిమా (Mark Antony) “మార్క్ ఆటోనీ”. అనవసరమైన లాజిక్స్ వెతక్కుండా.. జస్ట్ కామెడీ ఎంజాయ్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ముఖ్యంగా ఎస్.జె. సూర్య క్యారెక్టర్ & డైలాగుల కోసం ఈ సినిమాని హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి చూసేయొచ్చు!
రేటింగ్: 2/5