గత వారం అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమాగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ నిలిచింది. ఇది తమిళంలో రూపొందిన ‘మండేలా’ కి రీమేక్ అనే సంగతి తెలిసిందే.’మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి.. సంపూర్ణేష్ బాబు స్పూఫ్ కామెడీ సినిమాల నుండి బయటకు వచ్చి మొదటిసారి ఇలాంటి ఎమోషనల్ మూవీ చేసినట్టు టీజర్, ట్రైలర్.. లు క్లారిటీ ఇచ్చాయి. మరి సినిమా ఎంతవరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : టీజర్,ట్రైలర్ చూస్తేనే ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. పడమరపాడు అనే గ్రామంలో స్మైల్(సంపూర్ణేష్ బాబు) చెప్పులు కొట్టుకుంటూ .. తన స్నేహితుడు బాటా అనే కుర్రాడితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇతనికి ఇల్లు వంటివి ఏమీ ఉండవు. దీంతో ఊర్లో వాళ్ళు ఎక్కడ ఇతన్ని వెలేస్తారో అనే భయంతో వాళ్ళు చెప్పిన ప్రతి పనీ చేస్తూ ఉంటాడు.అలాగే చెప్పులు కొట్టుకుంటూ సంపాదించిన డబ్బుతో పెద్ద చెప్పుల షాప్ పెట్టుకోవాలనేది ఇతని కోరిక. అయితే ఇతను దాచుకున్న డబ్బుని ఓ అజ్ఞాత వ్యక్తి దొంగిలిస్తాడు. దీంతో స్నేహితుడి సూచన మేరకు అతని డబ్బుని పోస్టాఫీసులో దాచుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఆ పోస్టాఫీసులో పనిచేసే వసంత(శరణ్య ప్రదీప్) పరిచయమవుతుంది. అయితే పోస్టాఫీసులో డబ్బులు దాచుకోవాలి అంటే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటివి కావాలి అని ఆమె చెబుతుంది. అన్నికంటే ముందుగా ‘అసలు పేరు’ అంటూ ఒకటి ఉండాలి అని కూడా చెబుతుంది. కానీ స్మైల్ కి అతని పేరేంటో తెలీదు అని చెప్పగా.. మార్టిన్ లూథర్ కింగ్ అని అతనికి కొత్త పేరు పెడుతుంది. మరోపక్క అదే ఊరిలో జగ్గు(నరేష్) , లోకి(వెంకటేష్ మహా) ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. వారి ప్రచారంలో చేసిన సర్వే లో భాగంగా ఇద్దరికీ సమానమైన ఓట్లు పడతాయని తెలుస్తుంది. ఇంకొక్క ఓటు కనుక పడితే వీళ్ళలో ఒకరు గెలిచే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటు కనుక సాధిస్తే వీళ్ళకి రూ.5 కోట్ల ప్రాజెక్టు కూడా సొంతమవుతుంది. అదెలా? ఆ ఒక్క ఓటు ఎవరిది? మార్టిన్ లూథర్ కింగ్ జీవితంలోకి… జగ్గు, లోకి లు ఎందుకు వచ్చారు? వాళ్ళ వల్ల అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ఒరిజినల్ లో యోగి బాబు చేసిన పాత్రనే ఇక్కడ సంపూర్ణేష్ బాబు చేయడం జరిగింది. ఇప్పటివరకు అతన్ని మనం స్పూఫ్ కామెడీ సినిమాల్లోనే చూశాం. అయితే ‘మార్టిన్ లూథర్ కింగ్’ కోసం అతని ట్రాన్స్ఫార్మేషన్ అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ‘ఇలాంటి ఎమోషనల్ రోల్ కూడా సంపూర్నేష్ బాబు చేయగలడా?’ అనేవారికి తన నటనతోనే సమాధానం చెప్పాడు. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో అతనికి ఇలాంటి మంచి పాత్రలు ఇంకా వచ్చే అవకాశం ఉంది. అలాగే జగ్గు పాత్ర చేసిన సీనియర్ నరేష్.. మరోసారి తన మార్క్ నటనతో ఆ పాత్రకి జీవం పోశాడు. కొంతవరకు ఏపీ సీఎం జగన్ పై ఇది సెటైరికల్ గా ఉండటంతో అందరూ వెంటనే కనెక్ట్ అవుతారు. ఇక లోకి పాత్రలో వెంకటేష్ మహా బాగా చేశాడు. ‘తియ్యగుంటది’ అనే డైలాగ్ తో లోకేష్ ను గుర్తుచేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక శరణ్య ప్రదీప్.. వసంత పాత్రలో పోస్టాఫీసులో పనిచేసే అమ్మాయిగా తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. కొత్తవాళ్లు కావడంతో మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. కానీ ఆ పాత్రల పరిధి మేరకు వాళ్ళు కూడా బాగానే చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘మండేలా’ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడంలో దర్శకురాలు పూజ కొల్లూరు మంచి మార్కులు వేయించుకుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది.ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. సినిమాని ముగించిన తీరు ఎందుకో ‘ఇన్ కంప్లీట్’ అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. దర్శకుడు వెంకటేష్ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. వినడానికి ఇది కొత్తగా ఉంది. బడ్జెట్ పరిమితులు దాటకుండా.. కథని నడిపించడానికి ఈ బాధ్యత అవసరం అని అతను చెప్పాడు.ఉద్దేశం మంచిదే… కానీ భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే అనిపిస్తుంది.
విశ్లేషణ : ఎలక్షన్స్ టైం దగ్గరపడుతున్న టైంలో ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా రావడం అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచే విషయం. దానిని పక్కన పెట్టేస్తే.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఓ హానెస్ట్ రీమేక్ అని చెప్పొచ్చు. సెకండాఫ్ ను ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉంటే.. ఫలితం ఇంకా బాగుండేదేమో..!
రేటింగ్ : 2.5/5