‘మళ్ళీ రావా’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి మంచి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ‘స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ‘గంగోత్రి’ చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరొందిన కావ్య కళ్యాణ్ రామ్ నటించడం ఓ స్పెషల్ అట్రాక్షన్.ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : కొన్ని కారణాల వల్ల తన భర్తకు దూరమైన నీలం (సంగీత) …తన కూతురు నాజియా(బాంధవి శ్రీధర్) నే సర్వస్వం అనుకుంటూ జీవిస్తూ ఉంటుంది. నీలం పక్కింట్లో గోపి (తిరువీర్) అనే వ్యక్తి కూడా నివసిస్తూ ఉంటాడు. అతను చాలా భయస్థుడు. కానీ తన కొలీగ్ అయిన మినీ (కావ్యా కళ్యాణ్ రామ్)ను ప్రేమిస్తుంటాడు.అలాగే నీలంకు ఎటువంటి అవసరం వచ్చినా గోపి సాయం చేస్తూ ఉంటాడు. అయితే అనూహ్యంగా నాజియా కొంచెం వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఆమెకు దెయ్యం పట్టి ఉంటుందని వారు భావిస్తారు.ఆమెను కాపాడుకునేందుకు వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? ఆ దెయ్యానికి కావాల్సింది ఏంటి? గోపి.. మినీ ల ప్రేమ వ్యవహారం ఏమయ్యింది? అసలు మసూద ఎవరు? చివరికి నీలం జీవితం ఏమైంది? ఆమె తన బిడ్డను కాపాడుకుందా? వంటి వాటి కోసం ‘మసూద’ చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : మసూద లో ప్రతి పాత్ర చాలా ఇంపార్టెంట్. అయితే కథ మొత్తం గోపి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. ఇతను ఎక్కువగా విలన్ రోల్స్ తో పాపులర్ అయినా.. ఈ పాత్ర అతని కెరీర్లో స్పెషల్ గా నిలుస్తుంది. సంగీత కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకుంది.ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కు నీలం పాత్ర ఇంకాస్త మైలేజ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. కావ్యా కళ్యాణ్ రామ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది.
నాజియా పాత్రలో నటించిన బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టింది అనే చెప్పాలి. ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసిందో తెలీదు కానీ.. ఆ పాత్రలో ఒదిగిపోయింది. మసూద పాత్ర సినిమాకు ప్రధాన బలం. ఆ పాత్ర గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుందేమో. సత్యం రాజేష్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ వంటి వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : కథ పరంగా చూసుకుంటే పాతదే అనిపించినా.. దాన్ని తీర్చిదిద్దిన తీరు మాత్రం కొత్తగా, ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది. దర్శకుడు సాయి కిరణ్ ను ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి.హారర్ సినిమాలు అనేసరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది.సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి మంచి నేపధ్య సంగీతం అందించాడు అని చెప్పాలి.
నగేష్ బానెల్ కెమెరా పనితనం కూడా కట్టిపడేస్తుంది. నిర్మాత కూడా కథకు తగ్గట్టు ఖర్చు చేసి ఎక్కడా లోటు చెయ్యలేదు అనిపిస్తుంది. రన్ టైం 2 గంటల 40 నిమిషాలు ఉండటం కొంత మైనస్ అని చెప్పొచ్చు. కానీ భయపెట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల అది పెద్ద మైనస్ గా అనిపించదు. సీక్వెల్ కోసం కూడా కొంత దాచిపెట్టుకున్నట్టు అనిపిస్తుంది.
విశ్లేషణ : ‘మసూద’ భయపెట్టడంలో 100 శాతం సక్సెస్ అయ్యింది.రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. మరి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..!
రేటింగ్ : 2.5/5