Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!
- November 13, 2026 / 07:49 PM ISTByPhani Kumar
Cast & Crew
- రాకేష్ వర్రె (Hero)
- మధుమిత (Heroine)
- సత్య, సురేష్, ఇంద్రజ, మధురిమ తదితరులు (Cast)
- ప్రశంకర్ (Director)
- మోగుళ్ళ చంద్రశేఖర్ (Producer)
- విశాల్ చంద్రశేఖర్ (Music)
- ఎదు రాధాకృష్ణన్ (Cinematography)
- రవితేజ గిరిజాల (Editor)
- Release Date : 13th నవంబర్ 2026
- క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ (Banner)
‘మిర్చి’ ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి పాపులర్ అయ్యారు రాకేష్ వర్రే. తర్వాత హీరోగా మారి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ‘జితేందర్ రెడ్డి’ వంటి సినిమాల్లో నటించాడు. ఇందులో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమా క్రిటిక్స్ ను మెప్పించింది. ఓటీటీలో బాగా పెర్ఫార్మ్ చేసింది. నిర్మాతగా మారి ‘పేక మేడలు’ అనే చిన్న సినిమాని నిర్మించాడు. అది కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని ‘మాయ లేడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి:
Maya Lady Movie Review

కథ: క్రిష్(రాకేష్ వర్రే) మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ కోచింగ్ ఇస్తుంటాడు. ఒకసారి కొంతమంది అబ్బాయిల చేతిలో వేధింపులకు గురైన యువతి విషయమై కోర్టుకెక్కుతాడు క్రిష్. అయితే చివరి వాయిదాలో ప్రత్యక్ష సాక్షి భయాందోళనకి గురై కోర్టుకు రావడానికి నిరాకరించడంతో కేసు ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సరిగ్గా అలాంటి టైంలో ఓ అమ్మాయి(మధుమిత) వచ్చి తన దగ్గర ఉన్న ఆదారాన్ని జడ్జ్ కి చేరవేస్తుంది. దీంతో క్రిష్ కేసు నెగ్గుతాడు. ఆ అమ్మాయి ధైర్యానికి ఇంప్రెస్ అయిన క్రిష్ తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తర్వాత ఒకసారి ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఆమె పేరు ఆశ అని తెలుసుకుంటాడు.
ఆమెతో పరిచయం పెంచుకునే క్రమంలో కాఫీకి ఇన్వైట్ చేయగా..అందుకు ఆమె నిరాకరిస్తుంది. తర్వాత స్నేహితుడు వినయ్(సత్య) సాయంతో అదే అమ్మాయిని అనుకోకుండా పబ్బులో కలుస్తాడు క్రిష్. అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. కొద్దిరోజుల్లోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ ఒకసారి తాను ప్రేమించింది ఆశని కాదు రూపని అని తెలిసి షాక్ కి గురవుతాడు. అసలు ఆశ ఎవరు? రూపతో ఆమెకు సంబంధం ఏంటి? వీరిద్దరి గతం ఏంటి? వీరి మదర్ చైత్ర వర్రే(ఇంద్రజ) క్రిష్ కి చేసిన సాయం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: రాకేశ్ వర్రే నటన ప్రామిసింగ్ యాక్టర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా అతను ఎంచుకునే పాత్రలు కూడా బాగుంటాయి. కథల పట్ల కూడా అతనికి మంచి టేస్ట్ ఉంది. ఓటీటీ మార్కెట్ కూడా సంపాదించుకున్నాడు. అయితే ఓ థియేట్రికల్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో క్రిష్ పాత్రలో చాలా రాకేష్ తన బెస్ట్ ఇచ్చాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో ఫైట్స్ కూడా బాగా చేశాడు. ఇక రాకేష్ ఫ్రెండ్ పాత్రలో సత్య కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు.
ఈ సినిమాలో కేవలం కామిడీతో మాత్రమే కాకుండా బెస్ట్ ఫ్రెండ్ గా ఎమోషన్ కూడా బాగా పండించాడు. భవిష్యత్తులో సపోర్టింగ్ రోల్స్ కి కూడా సత్య మంచి ఛాయిస్ అని ఈ ‘మాయ లేడి’ తో ప్రూవ్ అయ్యింది. ఇక హీరోయిన్ మధుమిత కూడా 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇంద్రజ హీరోయిన్ తల్లి పాత్రలో తన మార్క్ నటన కనబరిచింది. సీనియర్ హీరో సురేష్ ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత కొంత కామిడీ ట్రై చేశాడు. ఎమోషనల్ గా అయితే అంత డెప్త్ లేని పాత్ర అది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు ప్రశంకర్ ఈ సినిమాలో చెప్పింది కొత్త కథేమీ కాదు. PTSD(Post-traumatic stress disorder) పాయింట్ తో గతేడాది కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ సినిమా వచ్చింది. అయితే దాన్ని కామిడీ జోనర్లో నడిపించారు. ఈ సినిమా వచ్చేసరికి లైటర్ వేన్ ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు దర్శకుడు ప్రశంకర్. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు. లవ్ ట్రాక్ రెగ్యులర్ గా ఏమీ అనిపించదు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా టార్గెట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేదే. ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్తుంది. సత్య కామిడీ.. అతని వన్ లైనర్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
కానీ సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ బాగా స్లో అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా కన్క్లూజన్ బాగానే ఇచ్చారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగానే ఉన్నాయి.. నేపధ్య సంగీతం సినిమా మూడ్ కి తగ్గట్టు ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అంతే..! లిమిటెడ్ బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఎక్కడా లోటు చేయలేదు నిర్మాతలు. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు మాత్రమే ఉండటం ఇంకో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ: ‘మాయ లేడీ’ ఓ కొత్త అటెంప్ట్. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లిన వాళ్ళకి పర్వాలేదు అనిపించొచ్చు. సెకండాఫ్ బెటర్ గా రాసుకుని ఉంటే దీని స్థాయి మరోలా ఉండేది. ఓటీటీకి వచ్చాక ఈ సినిమా బెటర్ రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.

ఫోకస్ పాయింట్: అక్కడక్కడా అలరించే రొమాంటిక్ కామిడీ డ్రామా
రేటింగ్: 2.5/5













