‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్తుతం స్పీడ్ మీదుంది. చేతిలో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, ‘వృషకర్మ’ లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో, సడెన్ గా ఆమె పెళ్లి చేసుకోబోతోందనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమంది. అది కూడా టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరోతో ఏడడుగులు వేయబోతోందని ప్రచారం జరగడంతో ఇండస్ట్రీలో ఆసక్తి మొదలైంది.
ఆ హీరో మరెవరో కాదు, అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కొన్ని ఫోటోలు బయటకు రాగానే నెటిజన్లు కథలు అల్లేశారు. కేవలం స్నేహితులుగా ట్రావెల్ చేసినా, నెట్టింట్లో మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మీమ్స్, పోస్టులు వైరల్ అయ్యాయి. చూస్తుండగానే ఈ గాసిప్ ఇండస్ట్రీ సర్కిల్స్ లోకి కూడా పాకింది.
ఈ వార్తలు శృతి మించుతుండటంతో మీనాక్షి టీమ్ వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. మీనాక్షి, సుశాంత్ లు కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ లేదని స్పష్టం చేసింది. అనవసరంగా స్నేహానికి ప్రేమ రంగు పూయొద్దని, ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని ఫ్యాన్స్ కి, మీడియాకి విజ్ఞప్తి చేసింది.
మీనాక్షి ప్రస్తుతం తన కెరీర్ మీదే పూర్తి దృష్టి పెట్టిందని టీమ్ వెల్లడించింది. పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదని, వరుస సినిమాలతో బిజీగా ఉందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా, సౌత్ లో సత్తా చాటుతున్న ఈ భామ, త్వరలో బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోందట. ఇలాంటి కీలక సమయంలో పెళ్లి పుకార్లు ఆమె కెరీర్ కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉండటంతోనే టీమ్ ఇంత వేగంగా రియాక్ట్ అయ్యింది.