పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టులో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభాస్‌కు తండ్రిగా సుమారు 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని, సెకండాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని రకరకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి.
సందీప్ వంగాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే. తన ఆఫీసులో కూడా చిరంజీవి వింటేజ్ పోస్టర్‌ను పెట్టుకుని తన ఆరాధ్య దైవంపై మక్కువ చాటుకున్నారు. ఈ క్రమంలోనే ‘స్పిరిట్’లో చిరంజీవి కూడా ఉంటే బాక్సాఫీస్ లెక్కలు మొత్తం మారిపోతాయని మెగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే, ఈ అంచనాలు ఎంత పెరిగితే సినిమాకు అంత రిస్క్ అనే చర్చ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో నడుస్తోంది.
నిజానికి ఈ గాసిప్స్ పై సందీప్ రెడ్డి వంగా ఇదివరకే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. గత నవంబర్‌లో ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు ఈ ప్రశ్న ఎదురవ్వగా.. ‘స్పిరిట్’లో మెగాస్టార్ ఉన్నారనేది కేవలం రూమర్ అని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ తనకు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే.. ఇలాంటి చిన్న పాత్రలు కాకుండా ఆయనతో ఒక పూర్తి స్థాయి ‘సోలో ఫిల్మ్’ చేస్తానని వంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.
దర్శకుడు అంత క్లియర్‌గా చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్స్ ఆగడం లేదు. ముఖ్యంగా చిరంజీవి ‘స్పిరిట్’ పూజా కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ ఊహాగానాలు మళ్ళీ ఊపందుకున్నాయి. గతంలో లోకేష్ కనగరాజ్ సినిమాల విషయంలో కూడా ఇలాగే లేని అంచనాలు పెంచేసి చివరకు ఆడియన్స్ నిరాశ చెందేలా చేశారు. ‘స్పిరిట్’ విషయంలో కూడా అదే పునరావృతం కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ ఇలాంటి రూమర్లను నమ్మకపోవడమే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.
సందీప్ వంగా తన సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. సర్ ప్రైజ్ ఏదైనా ఉంటే అది నేరుగా థియేటర్లోనే చూపించాలని ఆయన కోరుకుంటారు. ప్రస్తుతానికి మెగాస్టార్ ఈ ప్రాజెక్టులో లేరన్నది చేదు నిజం. ప్రభాస్ ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.