తన మీద, తన సినిమా మీద ఎవరన్నా, ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకునేంతవరకు ఊరుకోను అంటూ ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన నటించిన ‘జిన్నా’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోండి. అయితే ఈ సినిమా తర్వాత మంచు విష్ణు, సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఓ టీవీ ఛానల్లో లైవ్ షోలో పాల్గొన్నారు.
విష్ణు షోలో ఉన్నప్పుడు ఓ కాలర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కాలర్ ‘జిన్నా’ సినిమా పరిస్థితి గురించి లైవ్‌లో చెప్పిన మాటలు.. ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. షోను హ్యాండిల్ చేస్తున్న ప్రజెంట్ కమ్ యాంకర్ స్పాంటేనిటీతో కాలర్ కాల్‌ను కట్ చేసేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బెంగుళూరులో ఉంటున్న భార్గవ్ అనే వ్యక్తి.. కాల్ చేసి సినిమా గురించి చెప్పబోయారు.
తొలుత యాంకర్ మీరు సినిమా చూశారా అని అడిగితే.. ‘నేను సినిమా ఇంకా చూడలేదు. మొన్నీమధ్య సినిమా చూడటానికి వెళ్తే అక్కడ పది మంది ఉంటేకానీ షో వెయ్యం అన్నారని, షో రద్దు చేస్తున్నాం అని చెప్పారని, దాంతో వెనక్కి వచ్చేశానని’’ చెప్పారు. విషయం అర్థం కాని (?) విష్ణు.. ఈ వారం అక్కడ 11 సినిమాలు వచ్చాయని ఏదో చెప్పబోయారు. అయితే యాంకర్‌కు అర్థమై కాల్ కట్ చేయించేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
విష్ణు మీద మీమ్స్ అంటూ ఒకడుగు ముందే ఉండే మీమర్స్ ఇప్పుడు ఆ వీడియోను పట్టుకుని తెగ అల్లరి చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ‘పుండు మీద కారం చల్లడం ఎందుకు?’ అంటూ మీమర్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సినిమా పరిస్థితి మరీ అంత దారుణంగా ఉందో లేదో తెలియదు కానీ.. కాలర్ మాత్రం అలా చెప్పారు. ఇదంతా చదువుతుంటే ‘ఆంజనేయులు’ సినిమాలో ఎమ్మెస్ నారాయణ – రవితేజ కామెడీ ట్రాక్ గుర్తొస్తే మాకేం సంబంధం లేదు.
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!