“దొరసాని” అనంతరం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్”. “96” ఫేమ్ వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా వినోద్ ఆనంతోజు దర్శకుడిగా పరిచయమయ్యాడు. గుంటూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నేడు (నవంబర్ 20) అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తోలి చిత్రంతో నటుడిగా అలరించలేకపోయిన ఆనంద్ దేవరకొండ రెండో చిత్రంతోనైనా పరిణితి చెందాడో లేదో చూద్దాం.
కథ: రాఘవ (ఆనంద్ దేవరకొండ) కొలకలూరు గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి చిన్న హోటల్ నడుపుతూ.. ఎప్పటికైనా గుంటూరులో హోటల్ పెట్టి తాను చేసే బొంబాయి చట్నీతో ఫేమస్ అయిపోవాలని కలలుగంటుంటాడు. అతడి మామ నాగేశ్వరరావు, మరదలు సంధ్య (వర్ష బొల్లమ్మ)లకు చెందిన షెడ్ రెంట్ కు తీసుకోవడం ఇష్టం లేకపోయినా.. వేరే ఆప్షన్ లేకపోవడంతో అక్కడే “రాఘవ టిఫిన్ సెంటర్”ను మామిడి చెట్టు అడ్డంగా ఉన్న షెడ్ లోనే పెడతాడు.
ఈ హోటల్ పెట్టడానికి, పెట్టిన తర్వాత హోటల్ ను ఫేమస్ చేయడానికి రాఘవ & ఫ్యామిలీ పడిన కష్టాల, అడ్డొచ్చిన అవాంతరాల సమాహారమే “మిడిల్ క్లాస్ మెలోడీస్”.
నటీనటుల పనితీరు: సాధారణంగా సినిమాల్లో హీరో, హీరోయిన్, విలన్ లేదా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంటుంది. కానీ.. ఈ చిత్రంలో తండ్రి పాత్ర విశేషంగా హైలైట్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటులు, దర్శకులు గోపరాజు రమణ ఈ చిత్రంలో పోషించిన కొండలరావు పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆయన పాత్ర హాస్యం మాత్రమే కాక చక్కని ఎమోషన్ ను కూడా పండించింది. ఆ తర్వాత నటుడిగా మంచి మార్కులు సంపాదించిన వ్యక్తి చైతన్య గరికపాటి. స్నేహితుడి పాత్రలో ఎదో కనిపించి వెళ్ళిపోయాడు అన్నట్లుగా కాక పాత్ర అవసరం మేరకు మాత్రమే ఎమోషన్స్ పలికించి కథనంలో కీలకపాత్ర పోషించాడు. గ్రామీణ యువతిలా వర్ష బొల్లమ్మ సరిగ్గా సరిపోయింది.
ఇక కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటుడిగా తడబడుతూనే ఉన్నాడు. డైలాగ్స్ ను అప్పజెబుతున్నట్లుగా, మొఖంలో ఎమోషన్ ఏం పలికిస్తున్నాడో అనేది కింద వచ్చే షబ్ టైటిల్ ను చూసి అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. నట తృష్ణతో పాటు నటనలో ఓనమాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఆనంద్ కు చాలా ఉంది. కథానాయకుడు వీక్ అవ్వడంతో.. మిగతా క్యారెక్టర్స్ అన్నీ విశేషంగా హైలైట్ అయిపోయాయి. నాగేశ్వర్రావుగా నటించిన ఆర్.ప్రేమ్ సాగర్ కూడా సినిమాకి మంచి ఎస్సెట్. దివ్య శ్రీపాద దిగువ మధ్యతరగతి కుటుంబ యువతి పాత్రలో సహజమైన నటనతో అలరించింది, అలాగే అంజయ్య పాత్రలో కట్ట ఆంటోనీ కళ్ళ వెంబడి వచ్చే నీళ్లు ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాయి.
సాంకేతికవర్గం పనితీరు: శ్వీకర్ అగస్తి సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఉన్నవి మూడు పాటలే అయినా.. అన్నీ ఆణిముత్యాలే. ముఖ్యంగా గుంటూరు పాట వినడానికే కాదు చూడడానికి కూడా భలే కమ్మగా ఉంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చాయి. ఒక సీన్ లెంగ్త్ ఎక్కువ అనిపించదు, ఏ ఒక్క సీన్ లో ల్యాగ్ లేదు. ఈ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ & ఎడిటర్ కి ఇవ్వాలి. 2.15 గంటల సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా కథనం రాసుకోవడం అనేది దర్శకుడి ప్రతిభకు తార్కాణం.
సాధారణంగా సినిమాలంటే.. పొలోమని ట్విస్టులు, డ్యాన్సులు, ఫైట్లు లేకపోతే మన ప్రేక్షకులు చూడరేమో అనే భ్రమలో ఉండిపోయారు మన తెలుగు దర్శకనిర్మాతలు. ఈ ఒరవడిని బ్రేక్ చేసి మలయాళ సినిమాలు ఎప్పుడో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. ప్రేక్షకుల్ని అలరించాలంటే కథ ఉండాలి, ఆకట్టుకొనే కథనం ఉండాలి. ఈ రెండిటి మేళవింపుకి సహజమైన సందర్భం ఉంటే చాలు. అది ప్రూవ్ చేసిన సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”. దర్శకుడు వినోద్ అనంతోజుకు దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది. తెలుగు సినిమా విలువను కాపాడే యువ దర్శకుల జాబితాలో వినోద్ ఎంచక్కా స్థానం సంపాదించుకున్నాడు. భవిష్యత్ చిత్రాలతో ఆ స్థానాన్ని పదిల పరుచుకొంటాడని కోరుకుందాం.
విశ్లేషణ: అమ్మ ఇంట్లో పండక్కి చేసే కమ్మని చింతపండు పులిహోర లాంటి చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్”. కథానాయకుడు అనే పులుపు సరిగ్గా సరిపోయి ఉంటే రుచి అదిరిపోయేది.. అది తగ్గడంతో, ఓ మోస్తరుగా ఉండిపోయింది. అయితే.. సరదాగా కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూడదగ్గ చిత్రమిది.
రేటింగ్: 2.5/5