సిద్ధార్థ్ (Siddharth).. తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి నటుడు. గొప్ప కథలు, విజయం ష్యూర్ అనుకునే ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటూ వచ్చాడు. అయితే మధ్యలో ట్రాక్ తప్పాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటకు వచ్చే క్రమంలో చేసిన సినిమాలు తేడా కొట్టాయి. అలా బయటకు వచ్చి చేసిన కమర్షియల్ సినిమాల ఫలితాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో మళ్లీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అక్కడా కలిసి రావడం లేదు.
ఈ క్రమంలో కుటుంబ నేపథ్యం ఉన్న కథలు వైపు ఆలోచిస్తున్నాడు. ఆ మధ్య చేసిన ఒకట్రెండు సినిమాలు కాస్త ఫర్వాలేదు అనిపించాయి. ఆ ధైర్యమో ఏమో ఇప్పుడు పూర్తిగా కుటుంబ కథవైపు వచ్చేశాడు. అందులో మధ్య తరగతి చిన్న కుటుంబం నేపథ్యంలో సినిమా ఓకే చేశాడు. అదే ‘3 బీహెచ్‌కే’. ‘ఇది మా ఇంటి కథ. ఈ ఇల్లు చిన్న చిన్న మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది’ అంటూ సినిమాను అనౌన్స్ చేశారు.
సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ గణేశ్ తెరకెక్కిస్తున్నారు. ఓ మధ్య తరగతి కుటుంబం జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో శరత్ కుమార్ (R. Sarathkumar), దేవయాని (Devayani) , మీతా రఘునాథ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఓ కొలిక్కి వచ్చిందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అని చెబుతున్నారు.
అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే.. ‘3బీహెచ్‌కే’ అంటున్నారు. చిన్న కుటుంబం అంటున్నారు. అంటే పేరుకు, లైన్‌కు పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన సినిమా విషయంలో ఏదో పాయింట్ దాస్తున్నారు అని అర్థమవుతోంది. ఎందుకంటే 3 బీహెచ్‌కేని చిన్న ఇల్లు అని అనలేం. అంటే ఏదో కాన్‌ఫ్లిక్ట్ సినిమాలో చూపిస్తారన్నమాట. సినిమా ప్రచారం చేసుకున్న పాయింట్ అయితే బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా విజయం సిద్ధార్థ్‌కి అయితే చాలా కీలకం.