మృణాల్ ఠాకూర్ తొలి సినిమా ఏది అంటే బాలీవుడ్ గురించి తెలిసినవాళ్లు ‘సూపర్ 30’ అని చెబుతారు. ఆ విషయం మీద అవగాహన లేనివాళ్లు ‘సీతారామం’ అని తెలుగు సినిమా పేరు చెబుతారు. ఆమె ఫిల్మోగ్రఫీని చూసినవాళ్లు అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు ఆమె చాలా సినిమాలు చేసింది అని చెబుతారు. ఇప్పుడు అలా చేసిన సినిమాల్లో తనకు పేరు తెచ్చిన ఓ సినిమా గురించి ఆమె మాట్లాడింది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం మృణాల్ ఠాకూర్‌ని చూస్తున్నాం అంటే ఆ సినిమానే ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు.
39 ఏళ్ల మృణాల్ ఠాకూర్ ఎప్పుడో 11 ఏళ్ల క్రితం అంటే 28 ఏళ్ల వయసులో ‘హలో నందన్’ అనే మరాఠీ సినిమా చేసింది. హిందీలోకి అయితే ‘లవ్ సోనియా’ అనే సినిమాతో వచ్చింది. ఇప్పుడు మాట్లాడింది కూడా ఈ సినిమా గురించే. ‘లవ్ సోనియా’ సినిమా విజయం నా జీవితానికి ఊహించని బహుమతిని ఇచ్చింది అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ‘లవ్ సోనియా’ సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఆ సినిమా గురించి మాట్లాడింది.
నేను ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిని. 2500 మందిలో నన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకోవడం సంతోషంగా అనిపించింది. ఇది నా మొదటి చిత్రం మాత్రమే కాదు.. జీవితాలను మార్చే సినిమా ప్రపంచంలోకి నేను వేసిన తొలి అడుగు అని చెప్పుకొచ్చింది. ‘లవ్ సోనియా’ సినిమా సెట్లో ఉన్నప్పుడు మృణాల్ చాలా భయపడిందట. ఎందుకంటే అందులో డెమి మూర్, రిచా చడ్డా, మనోజ్ బాజ్‌పాయ్ లాంటి అగ్ర నటులు చాలా మంది నటించారు. సెట్లో వారందరి మధ్య విశాలమైన సముద్రంలో అతి చిన్న చేపలా ఉన్నాను అని మృణాల్‌కి అనిపించేదట.
అదేంటి అంతకుముందు మూడు సినిమాల్లో నటించి ‘లవ్ సోనియా’ తొలి సినిమా అంటోందేంటి మృణాల్ అని అనుకుంటున్నారా? కొంతమంది హీరోయిన్లు అంతే అలానే చెబుతారు లెండి.