మిడ్ రేంజ్ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు మారుతీ. ఇతనితో సినిమా అంటే భారీ అంచనాలు నెలకొంటాయి. అందుకే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ఇతను బలంగా డిసైడ్ అయ్యాడు. ముందుగా చిరంజీవి వద్దకు వెళ్ళాడు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గారు. అయినా మారుతీ ప్రయత్నం వృధా కాలేదు. ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆల్రెడీ ఆయన ప్రభాస్ కు రూ.75 కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం కూడా జరిగింది.ప్రభాస్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. అయితే మారుతీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయి.
జూలైకి స్క్రిప్ట్ పూర్తయిపోతుంది.దసరా పండుగ టైంకి ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ గ్యాప్ లో ప్రభాస్ ‘సలార్’ ను కంప్లీట్ చేసెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ కూడా ఎక్కువ వెయిట్ చేయడం కష్టం. ‘కె.జి.ఎఫ్ 2’ హిట్ అయ్యింది కాబట్టి.. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ సలార్ ను హోల్డ్ లో పెట్టలేడు. కాబట్టి..వీలైనంత త్వరగా ‘సలార్’ ను కంప్లీట్ చేసేసి మారుతీ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు.ప్రభాస్ సినిమాకి అతను సంగీతం అందిస్తుండటం ఇదే మొదటిసారి.