కింగ్ నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2016 సంక్రాంతి కానుకగా విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఒక పక్కన జూ.ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ బాలకృష్ణ ‘డిక్టేటర్’ వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా వాటిని మించిన వసూళ్ళను నమోదుచేయడం అందరికీ షాకిచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం, బంగార్రాజుగా నాగార్జున నటన, నాగార్జున – రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్లు… ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందంటూ గత కొంతకాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు టాక్ నడిచింది.
ఇక ఈ సీక్వెల్ జనవరి నుండే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన మొదలుకాలేదట. అందుతున్న సమాచారం ప్రకారం వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ నాగ్ భావించాడట. అయితే ఎలక్షన్స్ హడావుడి ఉండడంతో.. జూన్ నుండీ రెగ్యూలర్ షూటింగ్ మొదలెట్టాలని బంగార్రాజు గ్యాంగ్ డిసైడ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ సీక్వెల్ కి కూడా కళ్యాణ్ కృష్ణే దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందట. ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ్ భావిస్తున్నాడట. ఇక ఈ సీక్వెల్ లో నాగ చైతన్య బంగార్రాజు మనవాడి పాత్రలో కనిపిస్తాడట. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.