‘వార్ 2’ సినిమా విషయంలో, దాని రిజల్ట్ విషయంలో..హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్..ల కంటే కూడా బయ్యర్ నాగవంశీనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఎందుకో అందరికీ తెలిసిందే. ‘వార్ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ ‘వార్ 2′ తొలి రోజు కలెక్షన్లలో హిందీ నెట్ కంటే మన నెట్ ఒక రూపాయి ఎక్కువ ఉండాలి. అది మీ బాధ్యత’ అంటూ ఎన్టీఆర్ అభిమానులకు పిలుపునిచ్చాడు నాగవంశీ.
ఆ తర్వాత ‘ఇది తారక్ అన్న బాలీవుడ్ ఎంట్రీలా కాదు.. హృతిక్ రోషన్ గారి టాలీవుడ్ ఎంట్రీలా ఉంది’ అంటూ మరో అతిశయోక్తితో కూడుకున్న కామెంట్ వదిలాడు.’వార్ 2′ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు నాగవంశీ కొనుగోలు చేశాడు. ఎన్టీఆర్ తో 2 సినిమాలు నిర్మించబోతున్నాడు. అలాగే అతనికి వీరాభిమాని. అందుకే ‘వార్ 2’ విషయంలో అంత హడావిడి చేశాడు నాగవంశీ.
అక్కడితో అయిపోలేదు. ‘వార్ 2’ తో పాటు ‘కూలీ’ కూడా ఒకే రోజు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగవంశీ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ‘ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ‘వార్ 2’ సినిమాని ఫస్ట్ చూస్తారు. తర్వాత మ్యాట్నీలకి ‘కూలీ’ కి వెళ్తాడు. ఎందుకంటే ‘వార్ 2′ పెద్ద సినిమా కాబట్టి’ అంటూ మరింత రెచ్చిపోయాడు. ఫైనల్ గా ‘వార్ 2’ రిజల్ట్ తో నాగవంశీని నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్లో ఆడుకున్నారు.
ఇదిలా ఉంటే.. మరోపక్క కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ‘ ‘వార్ 2’ మాత్రమే కాదు ‘కూలీ’ తెలుగు బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీనే కారణం’ అని అంటున్నారు. ఎందుకంటే ‘కూలీ’ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.35 కోట్ల నుండి రూ.30 కోట్లకు ఇచ్చేయడానికి ‘సన్ పిక్చర్స్’ వాళ్ళు రెడీ అయిపోయారు. కానీ నాగవంశీ ‘రూ.40 కోట్లు పెట్టి హక్కులు తీసుకుంటాను’ అని సన్ పిక్చర్స్ వాళ్ళకి ఆశ పుట్టించాడట. దీంతో ‘కూలీ’ ని ‘ఏషియన్ సంస్థ’ రూ.42 కోట్లు పెట్టి కొనాల్సి వచ్చింది. జీఎస్టీ వంటివి అదనం. ఇక బయ్యర్స్ కి ఇచ్చేసరికి ‘కూలీ’ టార్గెట్ రూ.47 కోట్లు అయ్యింది. ఓవరాల్ గా ఇప్పటివరకు రూ.42 కోట్ల వరకు వచ్చింది. మిగిలింది మొత్తం రికవరీ అవ్వడం కష్టం. రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే.. ‘కూలీ’ సూపర్ హిట్ అనిపించుకునేది. ఇప్పుడు యావరేజ్ మార్క్ వద్ద ఆగిపోవాల్సిన పరిస్థితి. దీనికి నాగవంశీనే కారణం అని కొందరు బయ్యర్స్ భావిస్తున్నారు.