ఈరోజు పొగిడినోడు.. రేపు ఏమని తిడతాడో అని భయపడుతుంటాను – నేచురల్ స్టార్ నాని

  • April 10, 2018 / 11:24 AM IST

‘మొదటి మూడు విజయాలు వచ్చినప్పుడు కాస్త ప్రెజర్ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ సినిమా ఇంకాస్త మంచి హిట్ అవ్వాలని తపించేవాడిని. కానీ.. ఇప్పుడు అలాంటి టెన్షన్ లేదు. ఒక నటుడిగా నేను పోషించే పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలిగానా లేదా? అనే విషయాన్ని మాత్రమే పట్టించుకొంటున్నాను. అందుకే కేవలం కథలపై కాన్సన్ ట్రేట్ చేస్తూ వరుస సినిమాలు చేయగలుగుతున్నాను. ఆడియన్స్ కి కూడా నా మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే నేను చేసే చిన్న చిన్న తప్పులను పెద్దగా పట్టించుకోకుండా ఆదరిస్తున్నారు. సో, ఆడియన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయకూడదు అనేదే నా ఫైనల్ గోల్’ అంటున్నాడు వరుస విజయాల నాని. నేచురల్ స్టార్ అనే ఆయన బిరుదును సీజనల్ స్టార్ అని మార్చాలేమో అనిపించేంతగా సీజన్ కో సినిమా రిలీజ్ చేస్తూ మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా నిలిచిన నాని నటించిన తాజా చిత్రం “కృష్ణార్జున యుద్ధం” ఈ గురువారం విడుదలవుతోంది. ఏప్రిల్ 12న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాని ముచ్చటగా మూడోసారి ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. ఈ సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!

“అ!” వల్ల పెద్ద గ్యాప్ వచ్చినట్లు అనిపించడం లేదు..

మామూలుగానే నా సినిమాలు ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకటి చొప్పున రిలీజ్ అవ్వడం వల్ల మీడియా ఫ్రెండ్స్ ని రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాను. అయితే.. “అ!” టైమ్ లో ప్రమోషన్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మళ్ళీ రెండు నెలల గ్యాప్ లోనే “కృష్ణార్జున యుద్ధం” ప్రమోషన్స్ లో పాల్గొనడం వల్ల పెద్దగా గ్యాప్ లేనట్లు అనిపిస్తోంది.

నేను నటించిన సినిమాలకంటే “అ!”కి మంచి పేరొచ్చింది..

నేను నటించిన సినిమాలకి కూడా రానంత అప్రిసియేషన్ నాకు “అ!” సినిమాకి వచ్చింది. ప్రతి ఒక్కరూ “అ!” సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు నన్ను విశేషంగా అభినందించారు. సోషల్ మీడియాలో ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి “నా సినిమాకి కూడా ఎప్పుడు ఈరేంజ్ లో హైప్ రాలేదు కదా” అనిపించింది. అయితే.. ఒక నిర్మాతగా “అ!” లాంటి ఎక్స్ పెరిమెంటల్ సినిమాతో సక్సెస్ అందుకోవడం అనేది మాత్రం ఎప్పటికీ మరువలేని విజయం. ఆ సినిమా ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని తీసినా.. మేం అనుకొన్నదానికంటే ఎక్కువ రీచ్, రెస్పాన్స్ వచ్చింది. సో, ఒక ప్రొడ్యూసర్ గా నేను వెరీ హ్యాపీ.

“జెండాపై కపిరాజు” కూడా మంచి సినిమానే..

నేను ఇప్పటివరకూ రెండు సినిమాలో ద్విపాత్రాభినయం చేశాను. “జెండాపై కపిరాజు, జెంటిల్ మెన్”. మళ్ళీ ఇప్పుడు “కృష్ణార్జున యుద్ధం”లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అప్పటికి కంటెంట్ సరిగా రీచ్ అవ్వక “జెండాపై కపిరాజు” ఫ్లాప్ అయ్యింది కానీ.. సరైన టైమ్ కి రిలీజ్ అయ్యుంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఆ సినిమా కంటెంట్ నాకు ఇప్పటికీ ఫేవరెట్.

రెగ్యులర్ డబుల్ రోల్ ఫిలిమ్స్ లా ఉండదు..

ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన డబుల్ రోల్ ఫిలిమ్స్ అన్నిటికంటే వైవిధ్యంగా ఉంటుంది “కృష్ణార్జున యుద్ధం”. ఈ సినిమాలో మేం కవల పిల్లలం కాదు. ప్రపంచంలో ఎలా అయితే ఏడుగురు ఒకే విధమైన పోలికలతో ఉంటారో.. అలాగే కృష్ణ-అర్జున్ అనే రెండు పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే.. సెకండాఫ్ మొత్తం కృష్ణ-అర్జున్ పాత్రలు కలిసే కనిపిస్తాయి. అంటే సెకండాఫ్ లో ఇద్దరు నానీలను కలిపి చూడొచ్చు. సో, భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది.

కృష్ణగాడు అందరికీ నచ్చేస్తాడు..

ఈ సినిమాలో నేను పోషించిన రెండు పాత్రల్లో నాకు ఫేవరెట్ అంటే “కృష్ణ” రోల్. అందరిలోనూ ఒక కృష్ణ అనే అల్లరి కుర్రాడు ఉంటాడు. వాడి యాస, భాష, వేషం అన్నీ అందరికీ నచ్చుతాయి. ఇక అర్జున్ అంటారా అది రాక్ స్టార్ రోల్ అందరూ ఆ క్యారెక్టర్ లో ఇమడలేరు, తమని తాము అందులో చూసుకోలేరు. సో, కృష్ణగాడు మాత్రం అందరికీ విపరీతంగా నచ్చేస్తాడు.

యాస కోసం కష్టపడాల్సి వచ్చింది..

నేను చూసిన కొన్ని తెలుగు సినిమాల్లో విలన్స్ తెలంగాణ యాసలో మాట్లాడేవారు. నేను అప్పట్లో అదే నిజమైన తెలంగాణ యాస అనుకొనేవాడ్ని. కానీ.. హైద్రాబాద్ వచ్చాక తెలంగాణ బాగా వచ్చిన నా స్నేహితులు మాట్లాడుతుంటే.. సినిమాలోది ఫేక్ తెలంగాణా యాస అని అర్ధమైంది. అందుకే “కృష్ణార్జున యుద్ధం”లో కృష్ణ క్యారెక్టర్ చిత్తూరు యాస మాట్లాడాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే.. మా డైరెక్టర్ గాంధీ, నాతోపాటు నటించిన సుదర్శన్, “ఫన్ బకెట్” మహేష్ చిత్తూరోళ్ళు కావడం వల్ల స్లాంగ్ అనేది ఈజీ అయిపోయింది. ఈ సినిమాతో మహేష్ కి మాత్రం మంచి పేరొస్తుంది.

ఇకపై అనకపోవచ్చేమో..

ఇప్పటివరకూ నేను ఎక్కువగా కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేశాను కాబట్టి సినిమా రిలీజయ్యాక “నాని సినిమా” అనే ట్యాగ్ తగిలించేవారు. అయితే.. ఇప్పుడు “కృష్ణార్జున యుద్ధం”కి మేర్లపాక గాంధీ సినిమా అనే అంటారు. అలాగే నాగార్జునగారితో నా తదుపరి చిత్రాన్ని “నాగార్జున సినిమా” అనే అంటారు. సో, కాంబినేషన్ బట్టి సినిమా సినిమాకి ఈక్వెషన్స్ మారిపోవడం అనేది ఖాయం.

ఆ పాట విన్నప్పుడే ఫిక్స్ అయ్యాను..

ఎప్పుడో ఒకసారి హిప్ హాప్ తమీజా చేసిన “వాడి పుల్లా వాడి” అనే పాట విన్నాను. తెగ నచ్చేసింది. ఆ తర్వాత ఆ కుర్రాడే “ధృవ” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి ఆ పాటలన్నీ విన్నాను, తెగ నచ్చేశాయి. ‘కృష్ణార్జున యుద్ధం” సినిమా డిస్కషన్స్ టైమ్ లో నేను-మేర్లపాక గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ గా హిప్ హాప్ అయితే బెస్ట్ అనుకున్నాం. హిప్ హాప్ తమిజ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆశ్చర్యపరుస్తాడు.

అనుపమకి కెమెరాతో మంచి కెమిస్ట్రీ ఉంది..

అనుపమను డైరెక్ట్ గా చూస్తే.. “శతమానం భవతి”లో యాక్ట్ చేసింది ఈ అమ్మాయేనా అనే సందేహం వస్తుంది. నేను కూడా సెట్స్ లో ఆమెను చూసి షాక్ అయ్యేవాడిని. ఆమె యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా చూస్తే ఒకలా ఉండేది.. అదే సీన్ మళ్ళీ మానిటర్ లో చూస్తే ఇంకోలా ఉండేది. ఆ అమ్మాయికి కెమెరాతో మంచి కెమిస్ట్రీ ఉంది. ఆమెకు అది మంచి వరం.

రుక్సర్ తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుంది..

ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది. కృష్ణ క్యారెక్టర్ కి ఆమె కథానాయికగా నటించింది. ఆమె చాలా డెడికేటెడ్, ప్యాషనేట్. లిప్ సింక్, డైలాగ్ డెలివరీ విషయంలో అమ్మాయి చాలా కష్టపడేది. మేం తిరుపతి వెళ్లినప్పుడు అందరం బస్ లో వెన్యూకి వెళ్ళాక అందరూ మంచి ఎక్సైట్ మెంట్ తో ఉంటే.. రుక్సర్ మాత్రం బస్ లో లాస్ట్ సీట్ లో కూర్చుని తన తెలుగు స్పీచ్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు అనిపించింది ఈ అమ్మాయి తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుందని.

ఎం.సి.ఏ కొంతమందికి మాత్రమే నచ్చలేదు..

“మిడిల్ క్లాస్ అబ్బాయి” చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా రొటీన్ గా ఉందని చాలా మంది అన్నారు. అయితే.. ఫైనల్ రిజల్ట్ మాత్రం సూపర్ హిట్. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేనేం అనుకుంటున్నాను అన్నది కాదు ఫైనల్ గా ఆడియన్స్ డెసిషన్ ఏమిటనేది ఫైనల్ అని. ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసిన కొన్ని తప్పులను ప్రేక్షకులు క్షమించేస్తున్నారు. నా మీద వారికున్న అభిమానం నేను చేసిన కొన్ని చిన్నపాటి తప్పులను క్షమించేలా చేసింది.

ఆ ఆలోచనా ధోరణి మారాలి..

కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు “లాస్ట్ మూడు నెలలుగా మంచి సినిమాలేమీ లేవండి, ఇప్పుడు మన సినిమా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది” అంటుంటారు. కానీ.. వాళ్ళకి అర్ధం కాని విషయం ఏమిటంటే.. ఆ మూడు నెలల్లో జనాలు థియేటర్ కి రావడం తగ్గించేశారు. సో, ఆ టైమ్ లో నా సినిమా రిలీజైనా ఫ్లాప్ అయిపోతుంది. “బాహుబలి” తర్వాత “భలే భలే మగాడివోయ్” రిలీజ్ అవ్వడం వల్ల కలెక్షన్స్ కాస్త ఎక్కువొచ్చాయి. సో, ఆ ఆలోచనా ధోరణి మారాలి. మన సినిమా కంటే ముందు, తర్వాత విడుదలైన సినిమాలు కూడా హిట్ అవ్వాలి. అప్పుడే ప్రేక్షకుడు థియేటర్ కి రావడానికి ఆసక్తి చూపుతాడు.

ఆ భయం ఎప్పుడూ ఉంటుంది..

వరుస విజయాలతో దూసుకుపోతున్నాను కదా అనే సంతోషం కంటే.. “ఒకవేళ నా సినిమా ఫ్లాపైతే పరిస్థితి ఏంటి?” అనే విషయం నేను ఎక్కువగా ఆలోచిస్తాను. బేసిగ్గా “కీడెంచి మేలెంచు” అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతాను. అందుకే ఇవాళ హిట్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి “భలే చేశారండి” అని అభినందిస్తే.. “నెక్స్ట్ సినిమా ఫ్లాపైతే ఏమంటాడో?” అనే భయం ఎక్కువగా ఉంటుంది.

వాల్ పోస్టర్ సినిమా స్థాపనా ధ్యేయం వేరు..

ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న నన్ను సినిమాలే ఇక్కడ నిలబెట్టాయి. ఆ కృతజ్ణతతో స్థాపించిన సంస్థ “వాల్ పోస్టర్ సినిమా”. ఈ బ్యానర్ లో అందరు కొత్తవాళ్లు, వైవిధ్యమైన కథలతో మాత్రమే సినిమాలోస్తాయి. ఈ బ్యానర్ లో నేను నటించను కూడా. భవిష్యత్ లో నాని ఏం చేశాడ్రా అంటే “వాల్ పోస్టర్ సినిమా” అనే బ్యానర్ నుంచి మంచి దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశాడు అనుకోవాలి. అదే నా ధ్యేయం.

“భరత్ అనే నేను” కోసం నేను కూడా వెయిటింగ్

“కృష్ణార్జున యుద్ధం” రిలీజైన వారం తర్వాత మహేష్ నటించిన “భరత్ అనే నేను” రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ వల్ల నా సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి అని చాలామంది చెబుతున్నారు. కానీ.. నేను మాత్రం ట్రైలర్ చూసినప్పట్నుంచి “భరత్ అనే నేను” సినిమా కోసం వెయిటింగ్. అయినా.. ఎప్పుడూ అన్ సీజన్ లో వచ్చే నేను ఫస్ట్ టైమ్ ఒక సీజన్ చూసుకుని వస్తున్నాను. సో, సమ్మర్ నాకు ఎంతలా అచ్చొస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus