మన సినిమాల్లో ఏది ఎలా ఉన్నా వినోదం ఉండి తీరాల్సిందే. అతికొద్ది సినిమాలే ఇందుకు మినహాయింపు. ఆ వినోదం ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో రూపంలో ఉంటుంది. కొందరి దృష్టిలో అర్థ నగ్న గీతాలు, అర్థంపర్థం లేని హాస్యం, భారీ పోరాట సన్నివేశాల్లో ఉంటే మరికొందరి దృష్టిలో కథానుగుణంగా వచ్చే సన్నివేశాల్లో ఉంటుంది. రెండో దానికంటే మొదటి దానిలో కథ డొల్ల అవుతుందన్నది అనుమానం లేని విషయం. యువ కథానాయకుడు నాని రెండో రకం సినిమాలే చేస్తున్నా వాటిల్లో కూడా కథ పలచబడి పోతుంది.తొలి సినిమా ‘అష్టాచమ్మా’ నుండి ‘ఎవడే సుబ్రమణ్యం’ వరకు నాని చేసిన సినిమాల్లో రొమాన్స్, మంచి హ్యూమర్ ఉంటుంది. తర్వాత నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ లోనూ అవి వున్నాయి.
అయితే ఈ రెండు సినిమాలకి ఉన్న మరో పోలిక ఉంది. అదే హీరో పాత్రకి గల లోపం. ‘భలే..’ సినిమాలో మతిమరుపు మనిషినిగా నవ్వులు పూయించిన నాని ‘కృష్ణగాడి..’ సినిమాలో భయస్తుడిగా అలరించాడు. ఈ సినిమాలు మొత్తంగా నాని నటనపైనే నడిచాయి. ఫలితంగా కథ ఒక చిన్న దారపు పోగుగా మిగిలిపోయింది. ఈ రెండు సినిమాల తర్వాత ‘జెంటిల్ మన్’ లేకపోతే నాని ఇరకాటంలో పడేవాడే. నిన్నటికి నిన్న తెరమీదికొచ్చిన ‘మజ్ను’లోను విరించి రాసిన కథపై ఎవ్వరు కన్ను మరల్చలేదు. కేవలం నాని మాటలు పలికిన తీరు, హావభావాలను మరోసారి చూసి సంబరపడి సీట్లు ఖాళీ చేశారంతే. సినిమాలో వినోదం ఉండాలి, అది హీరోతోనే పండించాలి అనుకుంటే ఐటమ్ సాంగ్, సపరేట్ కామెడీ ట్రాక్ లా అదీ ఒక మూస ధోరణే అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటానని చెప్పే నాని ఈ విషయం గుర్తెరగాలి. సో చివరిగా చెప్పొచ్చేదేమిటంటే స్టాప్ ఎంటర్టైనింగ్.. స్టార్ ఫోకసింగ్..!