“ఛలో” చిత్రంతో సూపర్ హిట్ అందుకొన్న నాగశౌర్య మళ్ళీ తన స్వంత బ్యానర్ లోనే నటించిన చిత్రం “@నర్తనశాల”. శ్రీనివాస చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శౌర్య మదర్ ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 30)న విడుదలైంది. శౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అయిన ఈ సినిమాలో శౌర్య గే పాత్రలో నటిస్తున్నాడంటూ విడుదలకు ముందు జరిగిన హల్ చల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంత హడావుడి సృష్టించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ : కళామందిర్ కళ్యాణ్ (శివాజీ రాజా) తనకు పుట్టబోయేది ఆడపిల్లేనని మెంటల్ గా ఫిక్స్ అయిపోవడం మాత్రమే కాక.. తన తల్లే మళ్ళీ తన కొడుకు కడుపున పుడుతుంది అని గట్టిగా ఫిక్స్ అయిపోయిన తండ్రి ఎక్కడ గుండె ఆగి చనిపోతాడేమో భయంతో పుట్టిన అబ్బాయిని అమ్మాయిలా పెంచుతాడు. అలా చిన్నప్పుడు అమ్మాయిలా పెరిగి పెద్దైన కుర్రాడు రాధాకృష్ణ (శౌర్య). చిన్నప్పటి నుంచి లేడీస్ మధ్య అమ్మాయిలా పెరగడం వలన అమ్మాయిలపట్ల ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఏర్పడతాయి రాధాకృష్ణకి. అందుకే “ఝాన్సీ లక్ష్మీ ఉమెన్ ఎంపవర్ మెంట్” పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఆడవాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ ట్రయినింగ్ ఇస్తూ వాళ్ళకి తోడ్పడుతుంటాడు.
అలా సరదాగా జీవితం గడిపేస్తున్న రాధాకృష్ణకి పెళ్లి చేయాలుకొంటాడు తండ్రి కళామందిర్ కళ్యాణ్. కానీ రాధాకృష్ణకు అమ్మాయిల మీద అలాంటి ఫీలింగ్స్ లేవని తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ రాధాకృష్ణకి అమ్మాయిల మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడానికి కారణం ఏంటి? రాధను ఇష్టపడిన సత్య (యామినీ భాస్కర్), మానస (కష్మీరా)ల పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రం “@నర్తనశాల”.
నటీనటుల పనితీరు : శౌర్య పాత్రకు తగ్గ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. అయితే సినిమాలో గే పాత్రలో నటించడం మాత్రం మనోడికి పెద్దగా కుదరలేదు. యామినీ గ్లామర్ తో అలరించడానికి ప్రయత్నించింది. ఆమె హాట్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది. కష్మీరా చూడ్డానికి పూనమ్ కౌర్ చెల్లెల్లా ఉండగా.. నటన మాత్రం అంతంతగా ఉంది. కళామందిర్ కళ్యాణ్ అనే తండ్రి పాత్రలో శివాజీ రాజా సెట్ అవ్వలేదు. ఆయన నటన కొన్ని సన్నివేశాల్లో చాలా అతి అనిపిస్తుంది. వైవా రాఘవ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ.. పంచ్ లు మాత్రం పెద్దగా పేలలేదు. సరైన పాత్ర పడితే స్టార్ కమెడియన్ అవ్వగల కామిక్ మెటీరీయల్ మాత్రం మనోడిలో పుష్కలంగా ఉంది.
జయప్రకాష్ రెడ్డి పాత్ర ఈ సినిమాకి ఆయువు పట్టు లాంటిది.. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే ఆయనే ఈ సినిమాకి రాధసారధి. “నాయక్” తర్వాత ఆయన అదే స్థాయిలో ఈ చిత్రంలో “ఏమిరా పొత్రం” అంటూ చేసిన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. అజయ్ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకొన్నాడు. శౌర్యను “బేబీ” అంటూ అజయ్ చేసే అల్లరి మంచి హాస్యాన్ని పండించింది. జబర్డస్త్ రాఘవ, జెమిని సురేష్ లు కాసేపు నవ్వించడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించారు.
సాంకేతికవర్గం పనితీరు : నాగశౌర్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు సంగీత దర్శకుడు మహత్ స్వరసాగర్ “ఛలో”స్థాయిలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. ఆర్.ఆర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. సిచ్యుయేషనల్ కామెడీ కబ్బటి మ్యూజింగ్స్ తోనే కామెడీ క్రియేట్ చేయాల్సిన చాలా సందర్భాలను సింపుల్ గా వదిలేశాడు మహత్. నెక్స్ట్ సినిమాలో ఈ తప్పుల్ని సరిదిద్దుకుంటే తండ్రిని తక్క తనయుడిగా నిలబడగల సత్తా ఉన్న కుర్రాడు.
విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీలో క్వాలిటీ ఉంది కానీ.. టైమ్ లేకపోవడం వల్లనో లేక దర్శకుడికి మంచి విజన్ లేకపోవడం వల్లనో సరైన కెమెరా ఫ్రేమ్స్ పడలేదు. ఆకట్టుకోవాల్సిన చాలా సన్నివేశాలు కేవలం సరైన ఫ్రేమింగ్స్ & కట్స్ లేకపోవడం వలన ఢీలాపడిపోయాయి. ఎడిటింగ్ సినిమాకి మైనస్. సరైన కట్స్ ఎక్కడా పడలేదు. ఐరా క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. షూటింగ్ మొత్తం రెండు మూడు ఇళ్ళలో చుట్టేసినట్లుగా ఉన్నప్పటికీ.. క్వాలిటీపరంగా మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు.
దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి రాసుకొన్న కథలో కొత్తదనం కొరవడినా… సన్నివేశాలు మాత్రం బాగానే డిజైన్ చేసుకొన్నాడు. సెకండాఫ్ మొత్తం కామెడీతో నింపేసిన శ్రీనివాస చక్రవర్తి ఫస్టాఫ్ లో కూడా కాస్త కామెడీ వాడి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఓవరాల్ గా ఒక్కసారి చూడదగ్గ చిత్రంగా “@నర్తనశాల”ను తీర్చిదిద్దాడు శ్రీనివాస్.
విశ్లేషణ : దర్శకుడికి ప్లానింగ్ తోపాటు విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. శౌర్య పాత్రలో ప్రాణం పెట్టి నటించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా వీరాలెవల్లో చేసినప్పటికీ.. దర్శకుడికి సరైన విజన్ లేని కారణంగా “@నర్తనశాల” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. అయితే.. లక్కీగా రేపు విడుదలవ్వాల్సిన “శైలజారెడ్డి అల్లుడు” పోస్ట్ పోన్ అవ్వడం, ఈవారం ఇంకో స్ట్రాంగ్ కంటెండర్ లేకపోవడంతో నాగశౌర్య “@నర్తనశాల”తో మరో హిట్ కొట్టినట్లే లెక్క. అయితే.. హీరోగా విశేషమైన భవిష్యత్ ఉన్న నాగశౌర్య తన తదుపరి సినిమాల విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది.
రేటింగ్ : 2.5/5