నవదీప్ (Navdeep) హీరోగా చాలా కాలంగా ఉన్నా.. ఇటీవల కాలంలో హీరోగా చేసిన సినిమాలు పెద్దగా రాలేదు. మళ్లీ హీరోగా వద్దాం అనుకుని చేసిన చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫంకూరీ గిద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యవతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేమను పొందడానికి సిద్ధమైంది. ‘ఆహా’ ఓటీటీలో జూన్ 27 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ మేరకు ఆహా టీమ్ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. బోల్డ్ సీన్లతో థియేటర్లలో రన్ అయిన సినిమా.. ఓటీటీలోకి వచ్చేసరికి అలాగే ఉంటుందో లేక కాస్త బోల్డ్ నెస్ పెంచుకుంటుందో అనేది చూడాలి. ఇక ఈ సినిమా కథేంటంటే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) ఒంటరి అయిపోతాడు. అతని జీవితంలో జరిగిందే ఈ సినిమా. మౌళి మేఘాలయలో ప్రకృతి మధ్య తనకు నచ్చినట్లుగా బతుకుతుంటాడు.
పెయిటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. మౌళికి ప్రేమపై నమ్మకం ఉండదు. తాను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి ఓ అఘోరా (రానా) ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ చిత్ర (ఫంకూరీ గిద్వానీ) మౌళి ముందు ప్రత్యక్షమవుతుంది. వారి ప్రేమ సాఫీగా సాగుతుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో మరో పెయింటింగ్ వేస్తాడు మౌళి. అప్పుడు కూడా చిత్రనే వస్తుంది.
రెండోసారి వచ్చిన చిత్రను ప్రేమించి మౌళి కాస్త లవ్ మౌళి అయ్యాడా? అసలు మౌళి ప్రేమకు దూరమవ్వడానికి కారణమేంటి? ప్రేమ అంటే ఏ మాత్రం పడని మౌళి నిజమైన ప్రేమను పొందాడా? ఈ క్రమంలో అతని ప్రయాణం ఎలా సాగింది అనేదే సినిమా కథ. యువతకు నచ్చే అంశాలున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఈ శుక్రవారంతో ముగియనున్నాయి.